08-09-2025 02:04:43 PM
వరంగల్ (విజయక్రాంతి): విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి వరదల్లో చిక్కుకున్న బస్సు ప్రయాణికులను సురక్షితంగా రక్షణ చర్యలు చేపట్టిన ఇంతేజార్ గంజ్ సీఐ షుకూర్(CI Shukur)కు నగరవాసులు అభినందనలు తెలుపుతున్నారు. ఆదివారం ఉదయం నుండి 9 గంటల వరకు త్రీ నగరిలో కురిసిన భారీ వర్షం కారణంగా వరంగల్ లోని పలు ప్రాంతాలతో పాటు రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతానికి బారీగా వరద నీరు వచ్చి చేరింది. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇంజన్లోకి నీరు వెళ్లి బస్సు ఆగిపోయింది. బస్సు ప్రయాణికులు ఆందోళన చెందారు. సమాచారం తెలుసుకున్న సీఐ షుకూర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని సురక్షిత చర్యలను చేపట్టారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా సమయానికి స్పందించి, తడిసి ముద్దయినప్పటికీ, నడుము వరకు చేరిన వరద నీటిలో సుమారు రెండు గంటలపాటు ప్రయాణికుల రక్షణ చర్యలను చేపట్టారు. వరద నీటిలో నిలిచిపోయిన బస్సును క్రేన్ల సహాయంతో బయటకు తీశారు. దీంతో శాఖపరమైన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నగరవాసులు ప్రజా సంఘాల నాయకులు, సిఐ షుకుర్ కు అభినందనలు తెలిపారు.