08-09-2025 05:04:17 PM
హుజరాబాద్,(విజయక్రాంతి): ముదిరాజ్ హక్కుల సాధన కోసం బుధవారం కరీంనగర్లో నిర్వహించబోయే హలో ముదిరాజ్ చలో కరీంనగర్ సభ పోస్టర్ ను హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వైస్ చైర్మన్ సంపత్ మాట్లాడుతూ.. ముదిరాజ్ హక్కుల సాధన కోసం, స్థానిక సంస్థల ఎన్నికలలో మేమెంతో మాకంత అనే నినాదంతో కరీంనగర్లో నిర్వహించబోయే మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జనాభా దామాషా ప్రకారం ముదిరాజులకు స్థానిక సంస్థల్లో సమానమైన వాటా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం ముదిరాజుల చిరకాల కోరిక అయిన బిసి-డి గ్రూపు నుండి బీసీ ఏ గ్రూప్ లోకి మార్చాలని కోరారు. రాష్ట్ర కార్పొరేషన్ పదవులలో ముదిరాజులకు కనీసం 8 పదవులు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీ పదవుల్లో ముదిరాజులకు సామాజిక న్యాయం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యవర్గ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక
ముదిరాజ్ సంఘం హుజురాబాద్ మండల అధ్యక్షునిగా నిమ్మ తిరుపతి, ఉపాధ్యక్షునిగా గట్టు సదానందం, కార్యదర్శిగా రెడ్డబోయిన రాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెసర కుమారస్వామి, డైరెక్టర్ గొడుగు సమ్మయ్య, గుడ్డేలుగుల రవి తెలిపారు. వీరి ఎన్నిక పట్ల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.