16-10-2025 05:09:22 PM
మెగా పశు వైద్య శిబిరం ప్రాంభోత్సవంలో ఎమ్మెల్యే విజయ రమణారావు..
పెద్దపల్లి (విజయక్రాంతి): పాడి రైతులు, పశువుల కాపర్లు పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. గురువారం నిట్టూరు గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామ మండల పశు సంక్షేమ విశేషాల గురించి అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వం తరఫున పశు సంక్షేమం, పాడి రైతులకు అమలు చేస్తున్న కృత్రిమ గర్భధారణ సేవలు, గొర్రెల కాపరులకు అందుతున్న టీకాలు, నట్టల నివారణ చర్యల గురించి వివరించారు.
మెగా క్యాంప్ లో పశువులకు గాలి కుంటు వ్యాధి టీకాలు వేయడం, చూడి పరీక్షలు గర్భాశయ సమస్యలు, వాటి నివారణ, పశువుల ఆరోగ్య సమస్యలు, నివారణ, నట్టల నివారణ చేపట్టడం జరుగుతుందని, అవసరమైన పశువుల కాపరులు, పాడి రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. నిట్టూరు గ్రామంలో 29 దూడలకు నట్టల మందు, 38 పాడి పశువులకు చూడి పరీక్షలు గర్భాశయ సమస్యలు, అన్ని పశువులకు గాలి కుంటు టీకాలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. కె విజయ భాస్కర్, అసిస్టెంట్ సంచాలకులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ వేణుగోపాల రావు, తెలంగాణ పశువు గణన అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సత్య ప్రసాద్ రెడ్డి, వెటర్నరీ సర్జన్ లు డాక్టర్ అఖిల్ రాజు, డాక్టర్ అనిల్ కుమార్, డా. సురేష్, డా. రవి, వెటర్నరీ అసిస్టెంట్లు, పెద్దపల్లి మండల గోపాల మిత్రులు చంద్రయ్య, శ్రీనివాస్ రవీందర్, మనోహర్, లక్ష్మణ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.