calender_icon.png 6 November, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

06-11-2025 01:12:54 AM

-హాలికేడు వద్ద మినీ వ్యాన్, కారు ఢీ

-నలుగురు సంగారెడ్డి జిల్లావాసుల మృతి

నారాయణఖేడ్, నవంబర్ 5: కర్ణాటకలోని బీదర్ జిల్లా హల్లిఖేడ్ వద్ద బుధవారం ఉదయం మినీ వ్యాన్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు సంగారెడ్డి జిల్లావాసులు దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎల్గోయికి చెందిన నాగరాజు (40), జగన్నాథ్‌పూర్ గ్రామాలకు చెందిన ఐదుగురు నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), ప్రతాప్ కర్ణాటకలోని గానుగపూర్ దత్తాత్రేయ ఆలయ సందర్శనకు కారులో వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా బీదర్ జిల్లా హల్లిఖేడ్ వద్ద ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్.. కారును ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు.

ప్రతాప్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతదేహాలను స్థానిక పోలీసులు బీదర్ జిల్లా పరిధిలోని మన్నేకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రతాప్‌ను బీదర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఎల్గోయి, జగన్నాథ్‌పూర్ గ్రామాల్లో మృతుల అంత్యక్రియలు పూర్తయ్యాయి. మనూర్ మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన నాగరాజు నారాయణఖేడ్‌లోని సాహితి కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. 

బస్సును ఢీకొన్న బైక్.. ఒకరి మృతి

ఇంద్రవెల్లి(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతిచెందారు. ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామ సమీపంలోని శంకర్‌గూడ వద్ద బుధవారం ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆదిలాబాద్ వైపు నుంచి వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో మండలంలోని హర్కపూర్ ఆంధ్‌గూడా గ్రామానికి చెందిన బి సంతోష్ (23) అక్కడికక్కడే మృతి చెందాగా, మరో యువకుడు సంజీవ్‌కు తీవ్రగాయాలు అ య్యాయి.

సంజీవ్‌ను ఆదిలాబాద్‌లోని రి మ్స్ ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరగడానికి రోడ్డుపై ఏర్పడిన గుంతలే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంతోష్ కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని హర్కపూర్ ఆంధ్‌గూడా గ్రామస్థులు డిమాండ్ చేశారు. 

నల్లమలలో రోడ్డు కిందకు దూసుకెళ్లిన బస్సు

అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి సమీపంలో బుధవారం ఘాట్‌రోడ్డుపై తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బ స్సు అక్కమహాదేవి మలుపు వద్ద అతివేగం తో అదుపు తప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు రోడ్డుపై అడ్డుగా నిలబడి ఉండటంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.