calender_icon.png 20 May, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థికమాంద్యం భయాలు!

12-03-2025 12:00:00 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చివరికి అగ్రజ్యాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెడుతున్నాయా?గత ఇరవై రోజుల్లో అమెరికాలో స్టాక్ మార్కెట్లు ఏకంగా రూ.349 లక్షల కోట్లు (4 ట్రిలియన్ డాలర్లు) నష్టపోయాయి. ఈ మొత్తం విలువ యూకే, ఫ్రాన్స్ జీడీపీలకన్నా ఎక్కువ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. టారిఫ్‌లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, పొదుపు పేరుతో ఖర్చులకు విధిస్తున్న పరిమితులు మార్కెట్లను కుంగదీస్తున్నాయి.

టారిఫ్‌లతో అమెరికాకు ఒనగూడే ప్రయోజనాల మాట ఎలా ఉన్నా అగ్రరాజ్యం ఆర్థిక మాంద్యంలోకి జారిపోయే ప్రమాదాలు మార్కెట్ పతనాన్ని నిర్దేశిస్తున్నాయి. ఒక్క సోమవారం రోజే నాస్‌డాక్ సూచీ ఏకంగా 4 శాతం నష్టపోయింది. 2002 తర్వాత ఇదే అత్యంత భారీ పతనం. డౌ జోన్స్ కూడా భారీగానే నష్టపోయింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఎన్విడియా, గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్, అమెజాన్, మెటా.. ఈ ఏడు దిగ్గజ టెక్ కంపెనీలు అమెరికా మార్కెట్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటాయి.

మార్కెట్ ఒడిదొడుకుల నేపథ్యంలో సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో ఈ కంపెనీలు మార్కెట్ విలువలో ఏకంగా 750 బిలియన్ డాలర్లు కోల్పోయాయి. ఒక్క యాపిల్ సంస్థే కేవలం ఒక్క రోజే దాదాపు రూ.15 లక్షల కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత నవంబర్‌లో ఆయన మిత్రుడు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా ఆర్జించిన లాభాలన్నీ ఇప్పుడు తుడిచిపెట్టుకు పోయాయి. గత డిసెంబర్‌నుంచి ఇప్పటివరకు ఆ కంపెనీ విలువ సగం కోల్పోయింది.

ఆర్థిక మాంద్యం భయాలను ట్రంప్ తోసిపుచ్చుతున్నప్పటికీ ఆయన తీసుకొంటున్న నిర్ణయాల ప్రభావం అందరికంటే ముందు అమెరికా వినియోగదారులపై ద్రవ్యోల్బణం రూపంలో పడుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కన్స్యూమర్ ఎకానమీ అన్న విషయం తెలిసిందే. దీంతో పెట్టుబడిదారులతో పాటుగా మార్కెట్ విశ్లేషకులు రానున్న ద్రవ్యోల్బణం డేటా కోసం ఎదురు చూస్తున్నారు.

అలాగే ఫెడ్ రిజర్వ్ చైర్మన్ పావెల్ వడ్డీరేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలనుకుంటున్నారు. గతంలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కోత విధిస్తుందన్న అంచనాలు ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని భావిస్తున్నారు. అమెరికా మార్కెట్ల పతనం యూరోపియన్ మార్కెట్లతో పాటుగా ఆసియా మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం చూపించాయి. అయితే ఆర్థిక మాంద్యం భయాలను ట్రంప్ కూడా పూర్తిగా తోసిపుచ్చకపోవడం గమనార్హం.

ఇలాంటి విషయాలను చర్చించడానికి తాను ఇష్టపడనన్నదే ఆయన సమాధానం. అమెరికా దీర్ఘకలిక ప్రయోజనాల కోసం తాను తీసుకొంటున్న నిర్ణయాల వల్ల తాత్కాలికంగా ఇలాంటి ఆటుపోట్లు సహజమేనని, రాబోయే వారాల్లో అంతా సర్దుకొంటుందని ఆయన భరోసా ఇస్తున్నారు. అయితే ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు 20 శాతం దాకా ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంటున్నారు.

 ఈ పరిణామాలు భారతీయ స్టాక్ మార్కెట్లపైన కూడా పడే ప్రమాదం లేకపోలేదని  నిపుణులు అంటున్నారు. గత కొద్ది రోజులుగా వరస నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నట్లు కనిపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు మార్కెట్లకు శరాఘాతం అయ్యే ప్రమాదం ఉందని వారంటున్నారు.రూపాయి మరింత ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.

ఏది ఏమయినా ట్రంప్ ప్రారంభించిన ట్రేడ్‌వార్ ప్రభా వం ప్రపంచ దేశాలపైకన్నా కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే ఎక్కువ ప్ర భావం చూపుతోందని చెప్పాలి. ఈ పరిస్థితులు మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే పక్షంలో అగ్రరాజ్యం మరో సారి ఆర్థికమాంద్యంలోకి జారుకునే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరి ట్రంప్ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని తన విధానాల్లో మార్పులు చేసుకుని దేశ ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్త్తారా లేక మొండిగా తాను అనుకున్నదే చేస్తారో చూడాలి. ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ అనతికాలంలోనే ప్రజాదరణను కోల్పోతున్నారనేది  నిజం.