20-05-2025 01:32:29 AM
హైదరాబాద్, మే 19(విజయక్రాంతి)/రాజేంద్రనగర్/చార్మినార్: గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి ఫైరింజన్ నీళ్లు లేకుండా వచ్చిందని, అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్లు లేవని, ఫైర్ బ్రిగేడ్‌కు సరైన మాస్కులు లేకపోవడంతో వాళ్లు లోపలికి వెళ్లి బాధితులను కాపాడలేకపోయారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ కారణంగానే ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేటీఆర్.. మృతుల కుటుంబాలకు 25లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగర్వాల్ సమాజ్ ఏర్పాటు చేసిన సమావేశంలో పా ల్గొని మృతులకు సంతాపం తెలిపారు. వారి ఆత్మ కు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడు తూ.. ప్రభుత్వం అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ, మౌలిక సదుపాయల కల్పనపై పెడితే బాగుండేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ చరిత్రలోనే గుల్జార్ హౌస్ ఘటన విషాదకరమని చెప్పారు.
125 సంవత్సరాల నుంచి చార్మినార్ వద్ద ఉంటున్న అగర్వాల్ కుటుంబం లో 17 మంది చనిపోవడం విషాదకరమన్నారు. అగర్వాల్ కుటుం బం మళ్లీ తమ వ్యాపారం ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ తరఫున కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు. తాము రాజకీ యం చేయడానికి రాలేదని, ఎవరినీ విమర్శించడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరే హోం, మున్సిపల్ శాఖలు ఉన్నాయ ని, ఘటన స్థలం దగ్గరికి రేవంత్‌రెడ్డి వస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
ప్రాణాలు పోయి న తర్వాత నష్టపరిహారం ఇచ్చి చేతు లు దులుపుకోవడం కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశా రు. అగ్నిప్రమాదం జరగగానే స్థానికులైన హిందువులు, ముస్లింలు పెద్ద సంఖ్య లో వచ్చి బాధితులను కాపాడారని స్థానికులు చెప్పారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టపోయిన వారి పట్ల ప్రభు త్వం మానవత్వంతో స్పందించాలని కోరా రు.
ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ, ప్ర మాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల మీ ద సమీక్ష సమావేశం పెట్టుకోవాలని సూచించారు. అధికారులకు నిరంతరం శిక్షణ ఇవ్వాలని, తరుచుగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్నారు. అందాల పోటీలపై పెట్టే ఖర్చు.. ఇలాంటి సందర్భాల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయలపై పెట్టాలన్నారు.
ఒకే కుటుంబంలో 10 మంది మృతి విషాదకరం
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఉప్పర్‌పల్లిలో బాధిత కుటుంబాలను మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కేటీఆర్ పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందని మృతుల కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతిచెందడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాతబస్తీ అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రదేశమని, ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్‌లు రావడానికి కూడా వీలు లేకుండా ఉన్నదన్నారు.