20-05-2025 01:41:19 AM
కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏడాదికి రూ.50వేలే
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల లో స్కూల్ ఫీజులు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఇంజినీరింగ్ ఫీజుల కంటే కూడా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ఫీజులు భారీగా ఉంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రైవేట్ కాలేజీల్లో ఇంజినీ రింగ్ ఏడాది ఫీజులు రూ.40వేలు నుంచి రూ.లక్ష వరకు ఉన్నాయి. అదే స్కూల్ ఫీజుల విషయానికొస్తే ఏడాదికి లక్ష నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూళ్లో ఎల్‌కేజీ ఫీజుకు డొనేషన్ రూ.లక్ష, ఫీజు రూ.1.6లక్షలు ఉంది.
మాదాపూర్, కొండా పూర్‌లోని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్ చెప్పే స్కూళ్లలోనైతే ఎల్‌కేజీ ఫీజు రూ.4లక్షల వరకుంటే, ఒకటో తరగతి ఫీజు దాదాపు రూ.4లక్షల నుంచి రూ.6లక్షల వరకు వసూలు చేస్తున్నారు. హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూళ్లో ఎల్‌కేజీకి రూ.60వేల వరకు డొనేషన్, రూ.1.5లక్షలు ఫీజును విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అయితే ఇందులో రకరకాల పేర్లతో ఈ ఫీజులను వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజులని, స్పెషల్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, డొనేషన్, కంప్యూటర్ ఫీజు, ట్రాన్స్‌పోర్ట్ ఫీజు, ల్యాబ్ ఫీజులని వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
కొన్ని స్కూళ్లు మాత్రం వీటికి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. అడ్మిషన్ తీసుకునేట ప్పుడు డొనేషన్ల లాంటి పేర్లతో ఎలాంటి ఫీజులను వసూలు చేయవద్దు. కానీ, కార్పొరేట్ పాఠశాలలు వీటిని పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఫీజులను ప్రతి ఏటా 20శాతం నుం చి 50శాతం వరకు పెంచేస్తున్నాయి. బడ్జెట్ స్కూళ్లు (చిన్నవి), ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు వేలు, లక్షల్లో ఫీజులను వసూలు చేస్తున్నాయి.
రకరకాల పేర్లతో బురిడీ..
ఐఐటీ ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్‌లాం టి పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను స్కూ ళ్లు ఆకర్షిస్తున్నాయి. వాస్తవానికి నిబంధనల ప్రకారం స్కూళ్లకు ఈ తరహా పేర్లు ఉండకూడదు. కానీ, విద్యాశాఖ అధికారుల పర్యవేక్ష ణ లేకపోవడంతో ఇవి యథేచ్చగా కొనసాగుతున్నాయి. రాష్ర్టంలో సుమారు 12వేల వరకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లున్నాయి. ఇందులో 40లక్షల వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఫీజులపై నియంత్రణ ఉండా లని గత కొన్నేళ్లుగా విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్ సంఘాలు పోరాటాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.
అయితే ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం 2017లో కేసీఆర్ ప్రభుత్వం ప్రొ ఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ఒక కమి టీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం పక్కనపెట్టింది. ఇప్పటికీ ఫీజుల నియంత్రణపై సర్కారు నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇటీవల రాష్ర్టప్రభుత్వం ఫీజు ల నియంత్రణపై దృష్టిసారించి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చించింది. పలు సంఘాల ప్రతినిధులు తమ వాదనలు వినిపించారు. ఏటా 15శాతం ఫీజులు పెం చుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు.
ఫీజుల పెంపు 15శాతం మించితేనే ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఆధీనంలోకి తీసుకురావాలని అధికారులను కోరారు. ప్రొఫెసర్ తిరు పతిరావు కమిటీ సిఫారసులు అమలుచేయాలని కోరారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై దృష్టిపెట్టాలని, చిన్న చిన్న స్కూళ్లను ఇబ్బందులకు గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే మరోసారి దీనిపై ప్రభుత్వం సమావేశమై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు చెబుతున్నాయి.