20-05-2025 01:48:28 AM
న్యూఢిల్లీ, మే 19: అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ వచ్చీ రావడంతోనే ప్రపం చ దేశాలపై సుంకాలు అంటూ విరుచుకుపడ్డారు. ఆ తర్వాత చాలా దేశాలు అమెరికా షరతులకు ఓకే చెప్పడంతో వాటికి తాత్కాలిక ఉపశమనం లభించింది. ఓ వైపు శాంతి మంత్రం జపి స్తూనే సుంకాల భయపెడుతున్న ట్రంప్ అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడూ వ్యవహరించని తీరులో ముందుకు సాగుతున్నారు. మధ్యప్రాశ్చ దేశాలైన సౌదీ అరేబియా, ఖతా ర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ల్లో ఆయన పర్యటన కూడా పలు విమర్శలకు తావిస్తోంది.
ఈ పర్యటనకు ముందే సుమారు 400 మిలి యన్ డాలర్ల విలువైన విమానాన్ని ఖతార్ ట్రంప్‌కు బహుమతిగా అందించింది. ఎంతమంది వద్దని మొత్తుకుం టున్నా ట్రంప్ మాత్రం ఆ బహుమతిని స్వీకరించారు. అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ట్రంప్ అనేక వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వివిధ దేశాలపై పెద్దమొత్తంలో సుంకాలు వేసిన ట్రంప్ ఆ వివ రాలను ముందే తన కంపెనీలతో పంచుకున్నాడని మరో ఆరోపణ ఉంది. ఆ వివరాల వల్ల సదరు కంపెనీలు భారీగా లాభపడ్డాయని పలువురి వాదన.
యుద్ధం
ట్రంప్ ఓ వైపు ప్రపంచ శాంతి అనే పాట పాడుతూనే మరోవైపు అనేక దేశాలను కొత్తగా విధించిన సుంకాలతో భయపెడుతున్నారు. ట్రంప్ సుంకాల దెబ్బకు భయపడి అనేక దేశాలు అమెరికాతో ఒప్పందాలు చేసుకున్నాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే నినాదంతో ముందుకు సాగుతూ.. ప్రపంచ దేశాలను భయపెడుతూ వస్తున్నారు. మరోపక్క తాను ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఆపేందుకు శ్రమిస్తున్నానని చెబుతున్నారు. ట్రంప్ రెండు నాల్కల ధోరణిని అందరూ ప్రశ్నిస్తున్నారు. భారత్ నడుమ కొద్ది రోజుల క్రితం ఉద్రిక్తతలు కొనసాగి చల్లారాయి. అయితే ఆ ఉద్రిక్తతలకు తానే పుల్‌స్టాప్ పెట్టానని ట్రంప్ ప్రకటించుకున్నారు. అంతే కాకుండా రెండు దేశాల నడుమ అణ్వాయుధ యుద్ధం కూడా ఆపానన్నారు.
వాణిజ్యం
ప్రపంచంలోని దేశాలను లొంగదీసుకునేందుకు ట్రంప్ వద్ద ఉన్న ప్రధానాస్త్రం వాణి జ్యం. వాణిజ్య భయంతోనే ఆయన అనేక దేశాలను తన దారికి తెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అమెరికాకు ఎప్పటికైనా ప్రత్యర్థిగా మారుతుందనే అనుమానంతో ఆయన చైనా పై ఎడాపెడా సుంకాలు విధించారు. ప్రస్తుతం ఆయన మిడిల్ ఈస్ట్ దేశాలతో కుదుర్చుకుంటున్న పలు ఒప్పందాలు సొంత కంపెనీలకు మేలు చేసే విధంగా ఉన్నాయని రాజకీయవేత్తలు చర్చించుకుంటున్నారు. ట్రంప్ కుటుం బానికి చెందిన క్రిప్టో కరెన్సీ వెంచర్ ‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’లో కూడా మిడిల్ ఈస్ట్ దేశాలు పెట్టుబడులు పెట్టాయి.
బహుమతులు
గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా వ్యవహరించని విధంగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ఖతార్ నుంచి ఆయన ఏకంగా 400 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన బోయింగ్747 విమానా న్ని బహుమతిగా అందుకున్నారు. ఇప్పటివరకు ఎంతో మంది అధ్యక్షులు అమెరికా పీఠం పై కూర్చున్నా, ఏ ఒక్కరూ ఇలా బహుమతు లు స్వీకరించలేదు. ఇలా బహుమతులు స్వీకరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా, ట్రంప్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.
సొంత కంపెనీలు
ఇక సుంకాల ప్రకటనకు ముందే తన సొంత కంపెనీలకు ట్రంప్ ఆ వివరాలు వెల్లడించారని, దాని వల్ల సదరు కంపెనీలు భారీ గా లాభపడ్డాయని పలువురు ఆరోపిస్తున్నా రు. అమెరికా అధ్యక్షుడిగా ఉంటున్న ట్రంప్ తన సొంత కంపెనీలకు ఇలా మేలు చేకూర్చడం సరికాదని వాదిస్తున్నారు. ట్రంప్ చర్య లు పాలిటిక్స్‌లో బిజినెస్సా? లేక బిజినెస్‌లోనే పాలిటిక్సా? అని ప్రశ్నిస్తున్నారు. కేవలం తన సొంత కంపెనీలకు మాత్రమే కాకుండా ఇన్వెస్టర్లకు ట్రంప్ పలు సూచనలు చేసి వారికి లాభాలు వచ్చేలా చేసినట్టు తెలుస్తోంది. పలు దేశాల మీద సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేసే క్రమంలో ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమంలో ‘కొనుగోలు చేసేందుకు ఇది ఉత్తమ సమయం!!!డీజేటీ’ అని పో స్ట్ చేశారు. ఈ పోస్ట్ చేసిన నాలుగుగంటల్లోపే అదనపు సుంకాల అమలును నిలిపివేశారు.
విసిగిపోయిన అమెరికన్లు!
ట్రంప్ కుర్చీనెక్కి ఆర్నెళ్లు కూడా పూర్తి కాకమునుపే షాక్‌ల మీద షాక్‌లు తగులు తున్నాయి. ట్రంప్ పాలనతో విసిగిపోయామని పలువురు అమెరికన్లు రోడ్ల మీదకు వచ్చి ‘హ్యాండ్స్ ఆఫ్’ నినాదాలతో హోరెత్తించారు. అంతే కాకుండా ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలను కూడా కోర్టులు తప్పుబట్టాయి. సామాన్య ప్రజల నుంచి చట్ట సభ్యుల వరకూ అంతా ట్రంప్‌కు వ్యతిరేకంగా మారుతున్నారు.
దోస్త్ అంటూనే దోచేస్తున్న ట్రంప్
భారత్‌తో తాను స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నానని, భారత ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని చెప్పే ట్రంప్ భారత్‌పై 26 శాతం సుంకాలను విధించారు. మో దీ స్వయంగా ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించినా కానీ ట్రంప్ కనిక రించలేదు. సుంకాల విషయంలో భారత్‌కు మినహాయింపునివ్వలేదు. ఇక అంతే కాకుండా భారత్ తమకు జీరో టారిఫ్స్ ఆఫర్ ప్రకటించిందని కూడా ట్రంప్ ప్రకటించేశారు. ఈ ఆ రోపణను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఖండించారు. మంత్రి ఖండించిన తర్వాతి రోజు కూడా ట్రంప్ అదే తరహాలో వ్యాఖ్యానించారు.