calender_icon.png 16 September, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ పది మందిపై అనర్హత వేటు వేయాలి

16-09-2025 01:21:20 AM

-ఆ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలున్నాయి.. 

-స్పీకర్‌కు వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీకి మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి 

-అందుబాటు లేకపోవడంతో శాసనసభ సహాయ కార్యదర్శికి వివరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఫిరాయింపై అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వివరణ ఇచ్చేందుకు సోమవారం ఆయన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, చింతా ప్రభాకర్‌తో కలిసి శాసనసభకు వెళ్లారు.

స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో వారు అసెంబ్లీ సహా య కార్యదర్శి ఉపేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు. బీఆర్‌ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబం ధించిన ఆధారాలు అందజేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో జగదీష్‌రెడ్డి మాట్లాడారు. తాము అమాయకులమని, తమ ఫొటోలను మార్ఫింగ్ చేశారని, ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇవ్వడం విడ్డూరమన్నారు. వారు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి, కాంగ్రెస్ జెండా కప్పుకున్నది వాస్తవమని, అక్కడితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాల్లో  పాల్గొన్నారని స్పష్టం చేశారు.

స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారని గుర్తుచేశారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిశానన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో ఎందుకు భేటీ అయ్యారో తెలపాలని డిమాండ్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిస్తే, మరి పేపర్ ప్రకటనల్లో ఎమ్మెల్యేతో ఫొటోతోపాటు కాంగ్రెస్ నేతల చిత్రాలు ఎందుకున్నాయని చెప్పాలని నిలదీశారు.

కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యేలు పార్టీ మారారని, ఆ విషయాన్ని తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు చెందిన ప్రజల ముందు అంగీకరించి, క్షమాపణలు కోరాలని హితవు పలికారు. తాము పార్టీ మారలేదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్లాలనే కానీ, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఇప్పటికే దొరికిపోయిన దొంగలని, ఇక న్యాయస్థానం నుంచి తప్పించుకోలేరని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ విదే శాల్లో ఉన్నారని, ఆయన స్వస్థలానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఫిరాయిం పునకు సంబంధించిన ఆధారాల ను స్పీకర్‌కు సమర్పిస్తామని వెల్లడించారు. ఖైరతా బాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని, అయినప్పటకీ ఆయనపై అనర్హత వేటు పడకపోవడమేంటని ప్రశ్నించారు.