20-11-2025 12:56:08 AM
-విద్యాసంస్థలపై కాంగ్రెస్ బ్లాక్ మెయిలింగ్ మానుకోవాలి
-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
-హస్తినాపురం చౌరస్తాలో విద్యార్థులతో భారీ ర్యాలీ
ఎల్బీనగర్, నవంబర్ 19: పెండింగ్‌లో ఉన్న రూ.6 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యా సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ చేయడం మానుకోవాలని అన్నారు. ఫీజుల విడుదల కోసం బుధవారం హస్తినాపురం చౌరస్తా నుంచి ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయలేదని, స్కాలర్‌షిప్ ఇవ్వలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగినందుకు రేవంత్‌రెడ్డి కాలేజీ యజమాన్యాలను ఫీజు డొనేషన్లు ఎలా తీసుకుంటారు? అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు.
బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ల సతీష్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్, బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేందర్, నాయకులు శివ యా దవ్ రాజ్ కుమార్, అజయ్, అంజి గౌడ్, శివ యాదవ్, అఖిల్, ప్రేం, ప్రవీణ్, వంశీ, అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మోసం చేస్తున్న కాంగ్రెస్
ముషీరాబాద్ (విజయక్రాంతి): స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లు 42 శాతం నుంచి 22 శాతం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి, బీసీలను పచ్చి మోసం దగా చేస్తుందన్నారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలకు పార్టీ ప్రతిపదికన 42 శాతం ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల వరకు ఆగి ఎన్నికల ఫలితాలు రాగానే అసలు నిజం రూపం బయటపడిందన్నారు.
గ్రామపంచాయతీ రిజర్వేషన్లు 22 శాతంకు తగ్గించి ఎన్నికలకు పోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందన్నారు. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా తీర్పు రాకముందే ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏముందని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ప్రధానమంత్రిని కలవడానికి ఎందుకు వెళ్ళలేదని, ఇదేనా చిత్త శుద్ధి అని ప్రశ్నించారు. ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తూన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో 240 ఎంపీలు ఉన్నారని గుర్తు చేశారు. ఒకరోజు కూడా పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించలేదన్నారు. ఇదేనా మీ చిత్తశుద్ధి అని ఆయన మండిపడ్డారు.