3 July, 2026 | 1:05 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

03-07-2026 12:00 AM

8న ఇందిరాపార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి, పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జూలై 8న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రకటించారు.

ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్‌కుమార్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా కృష్ణయ్య మాట్లాడారు. గతంలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలని కోరారు. ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలకు అమలు చేస్తున్న 10 వేల ర్యాంకు నిబంధనను ప్రభుత్వం తొలగించాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, కొందరు అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని  హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్‌లు రాందేవ్ మోడీ యాదవ్, నిఖిల్ పటేల్, భీమ్రాజ్, కృష్ణయాదవ్ పాల్గొన్నారు.