3 July, 2026 | 1:10 AM

‘జీ రామ్ జీ’ అమలు చేయాలి

03-07-2026 12:00 AM

ఈ పథకంతో రాష్ట్రానికి రూ.6,311.78 కోట్లు

సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ లేఖ

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణలో గ్రామీణ కార్మికులకు ఉపాధి, ఆదాయ భద్రత కల్పించేందుకు ‘జీ రామ్ జీ’(గ్రామీణ ఉపాధి) పథకాన్ని తక్షణమే అమలు చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ పథకం అమలుతో తెలంగాణకు మొత్తం రూ.6,311.78 కోట్ల నిధులు లభించే అవకాశం ఉందన్నారు.

ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటాగా రూ.3,825.31 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాగా రూ.2,486.47 కోట్లు భరించాల్సి ఉంటుందని వివరించారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం రోజువారీ కూలీని రూ.125 నుంచి రూ.300కు పెంచే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయని, ఇలాంటి సమయంలో గ్రామీణ ఉపాధి కల్పించడం సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాకుండా ఆర్థిక అవసరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నా పేదల కోసం ఈ పథకాన్ని అమలు చేయాలన్నారు.