10-01-2026 01:21:30 AM
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి) : నిరుద్యోగుల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి బీఆర్‌ఎస్ నాయకు లు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, పదేళ్ల కాలంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి, నిరుద్యోగుల జీవితాలను అంధకారం చేసినవారు.. ఇవాళ మొసలి కన్నీరు కారుస్తుంటే చూసి యావత్తు తెలంగాణ సమాజం నవ్వుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.
‘అశోక్‌నగర్ లైబ్రరీ సాక్షిగా పదేళ్లు నిరుద్యోగులను వంచించిన చరిత్ర మీది కాదా.. నాడు నోటిఫికేషన్ల పేరుతో ఊరించి, పరీక్షల పేరుతో వేధించి, నిరుద్యోగుల యవ్వనాన్ని రోడ్ల పాలు చేసింది మీరు కాదా..’ అని ప్రశ్నించారు. ‘అధికారం పోగానే మీకు నిరుద్యోగులు గుర్తొచ్చారా? రాజకీయం కోసం బురద చల్లడం మానేసి, మేము ఇచ్చిన అపాయింట్‌మెంట్ ఆర్డర్లను ఒకసారి లెక్కపెట్టుకోవాలి.. అప్పు డు తెలుస్తుంది దమ్ము ఎవరిదో.. మోసం ఎవరిదో’ అని సూచించారు.
‘టీజీపీఎస్సీ క్వశ్చన్ పేపర్లను పప్పు బెల్లాల్లా బజార్లో పెట్టి అమ్ముతుంటే... కళ్లు అప్పగించి చూసింది మీరు కాదా, ‘లీకేజీ’లతో లక్షలాది మంది నిరుద్యోగుల ఉసురుపోసు కున్న పాపం మీది కాదా’ అని నిలదీశారు. గ్రూప్--1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేని ‘అసమర్థత మీదని’, రెండు సార్లు ప్రిలిమ్స్ రద్దు కావ డం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు మానసిక వేదనకు గురైతే అప్పుడెందుకో మాట్లడలేదని ప్రశ్నించారు.
‘మేము అధికారంలోకి రాగానే ఉద్యోగ భర్తీని మీలా ‘లైట్’గా తీసుకోలేదు. ఒక ‘పవిత్ర కార్యం’గా తీసుకున్నాం’ అని తెలిపారు. ఎక్కడా ఎలాంటి లీకేజీలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఇప్పటికే 70 వేల మం దికి ప్రభుత్వోద్యోగాలు కల్పించి.. ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం చేశామని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారిలో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని వెల్లడించారు.
‘గ్రూ ప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల నిర్వహ ణ మీకు చేతకాక చేతులెత్తేస్తే.. మేం విజయవంతంగా నిర్వహించాం. అది వాస్తవం కా దా’ అని నిలదీశారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 అపాయింట్ మెంట్ ఆర్డర్లను ఇచ్చామని, త్వరలోనే గ్రూప్-3 అపాయింట్ ఆర్డర్లను కూడా ఇచ్చేందుకు ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు. ‘ఇది నిరుద్యోగుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న కమిట్‌మెంట్’ అని స్పష్టం చేశారు.
నిరుద్యోగ సోదరులకు విన్నపం
తాను శాసనమండలిలో అన్న మాటలను కొందరు కావాలనే పనిగట్టుకుని వక్రీకరిస్తున్నారని, తమ స్వార్థ రాజకీయాల కోసం ‘మిమ్మల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను ఆ మాట అన్నది మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు’ అని వివరించారు. ‘తెలంగాణ భవిష్యత్ మీరే. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మేం మొక్కుబడిగా తీసుకోలేదు. ఒక బాధ్యతగా తీసుకున్నాం’ అని తెలిపారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే మాట నిలబెట్టుకుంటున్నామని, ప్రభుత్వ ఉద్యోగాలను చిత్తశుద్ధితో భర్తీచేస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది నిరుద్యోగులున్నారని, ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే.. మరోవైపు పరిశ్రమల ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్‌పై దృష్టి సారించి ప్రైవేట్ రంగంలోనూ తెలంగాణ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ‘జాబ్ క్యాలెండర్’ విషయంలో ‘మా ప్రభుత్వం క్లియర్ కట్’గా ఉందని, ఇందులో ఎలాంటి అనుమానాలూ, సందేహాలకూ తావు లేదని తెలిపారు.
ఈ విషయంలో శాస్త్రీయబద్ధంగా ముందుకు వెళ్లాలన్నదే ‘మా ప్రభుత్వ సంకల్పం. మా ప్రభుత్వ చేతల్లో నిబద్ధత ఉంది. మీ పట్ల మాకు బాధ్యత ఉంది. మీ కష్టం విలువ మాకు తెలుసు’ అని స్పష్టం చేశారు. రాజకీయ నిరుద్యోగుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. వారి ఊబిలో చిక్కి.. వారి రాజకీయ క్రీనీడలో భాగస్వామ్యం కావద్దని పిలుపునిచ్చారు. ‘మీ భవిష్యత్‌కు మాది భరోసా.. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది’ అని శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు.