24-05-2025 12:00:00 AM
అదేవిధంగా లేఔట్‌లో ఆలయ స్థలానికి ప్రీ కాస్ట్ ఏర్పాటు
రాజేంద్రనగర్, మే 23: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు శంషాబాద్ రెవెన్యూ అధికారులు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి రెవెన్యూ అధికారుల కథనం ప్రకారం.. శంషాబాద్ మండల పరిధిలోని తొండపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 108 లో కొన్ని సంవత్సరాల క్రితం కొందరు రియల్టర్లు లేఅవుట్ ఏర్పాటు చేశారు.
అయితే 108 సర్వేనెంబర్ కు ఆనుకొని ఉన్న 109 సర్వే నెంబరు లో కోట్ల రూపాయలు విలువచేసే రెండెకరాల 23 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. రియాల్టర్లు ప్రభుత్వ భూమిని పార్కు స్థలంగా చూపిస్తూ కబ్జా చేసేందుకు పన్నాగం పన్నారు. ఈ నేపథ్యంలో కాలనీవాసులు హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో కొన్ని రోజుల క్రితం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు.
స్థానిక తహసిల్దార్ రవీందర్ దత్ తో మాట్లాడి అన్ని వివరాలు సేకరించారు. 109 సర్వే నంబరర్‌లో ఉన్న రెండేకరాల 23 గుంటల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురయ్యే అవకాశం ఉందని, దానికి ఫెన్సింగ్ చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ, సిబ్బంది కలిసి ప్రభుత్వ స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు ఏర్పాటు చేశారు.
- ఆలయ స్థలానికి ప్రీ కాస్ట్
సర్వే నెంబరు 108లో లేఔట్ చేసిన వ్యక్తులు గతంలో ఆలయానికి సుమారు ఎకరం స్థలం వదిలారు. ఆ స్థలం కబ్జాకు గురయ్యే అవకాశం ఉందని కాలనీవాసులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆలయ స్థలానికి కూడా ప్రీ కాస్ట్ ఏర్పాటు చేయడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.