24-05-2025 07:01:58 PM
విజయవాడ కాజీపేట సెక్షన్లో పలు రైళ్ల రద్దు..
మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు..
ప్రయాణికులకు ఇబ్బందులు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): విజయవాడ కాజీపేట రైల్వే సెక్షన్ లో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఎన్ఐ(Non-interlocking Signal Traffic Control) పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించగా, ఇంకొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. పలు రైళ్లకు మహబూబాబాద్ కు బదులు కేసముద్రం రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇచ్చారు. కొత్తగా చేపట్టిన మూడో రైల్వే లైన్ సిగ్నల్ మార్పులు, ట్రాక్ అనుసంధానం కోసం అప్ లైన్ లో ఈనెల 24 నుంచి 27 వరకు ఐదు రోజులపాటు విజయవాడ కాజీపేట సెక్షన్లో నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు.
23 నుండి 27 వరకు అప్, డౌన్ మార్గాల్లో బ్లాక్ తీసుకొని ఎన్ఐ పనులు నిర్వహించనున్నారు. అయితే విజయవాడ డోర్నకల్ కాజీపేట మార్గంలో ఉదయం పూట ప్రజలు ఎక్కువగా ప్రయాణించే శాతవాహన, గోల్కొండ, సింగరేణి, పుష్ పుల్ తదితర రైళ్లను రద్దు చేయడంతో, కాకతీయ, కృష్ణ ఎక్స్ ప్రెస్ రెండు రైళ్లపై ప్రయాణికుల భారం పెరిగింది. దీనితో వందలాదిమంది ప్రయాణికులు ఆ రైళ్లలో ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈనెల 27 వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది.