24-05-2025 07:22:32 PM
కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే గండ్ర పిలుపు..
ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు..
జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించే విధంగా పనిచేసి ప్రజల్లో గుర్తింపు సాధించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao) పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జీఎస్సార్, డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిశీలకులు మాసంపెల్లి లింగాజీ పాల్గొని కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో 30 వార్డులకు 30 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే విధంగా కృషి చేయాలని, ప్రజల్లో మంచితనం ఉన్నవారికే గెలుపు అవకాశాలు ఉంటాయన్నారు. క్షేత్ర స్థాయి నుండి పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం పాటించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ అన్నారని గుర్తుచేశారు. ఆమేరకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ ప్రక్షాళనలో పీసీసీ పరిశీలకుల బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.