24-05-2025 07:05:34 PM
జిల్లా కలెక్టర్ రాజర్షి షా..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): గ్రామ పాలన అధికారుల నియామకం కోసం ఈనెల 25న జరిగే రాత పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah) తెలిపారు. రాత పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై శనివారం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామ పాలన అధికారుల రాత పరీక్ష కోసం చేపట్టిన చర్యల గురించి ఆయా శాఖల వారీగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా రాత పరీక్ష జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో 83 మంది అభ్యర్థులు గ్రామ పాలన అధికారుల నియామక రాత పరీక్షకు హాజరు కానున్నారని, వీరికి మావలలో నలంద డిగ్రీ కళాశాల(Nalanda Degree College)లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.30 గంట వరకు పరీక్ష కొనసాగుతుందని సూచించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని హితవు పలికారు. పరీక్ష ప్రారంభం అయిన మీదట ఆలస్యంగా వచ్చే వారిని లోనికి అనుమతించరని స్పష్టం చేశారు. కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా పర్యవేక్షణ జరపాలని, నియమ నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలోని అన్ని గదులలో అభ్యర్థులకు తగిన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.