calender_icon.png 13 January, 2026 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీల్లో ఎన్నికల ‘వేడి’!

13-01-2026 02:01:06 AM

ఓటర్ల తుది జాబితా వెల్లడి 

మహబూబాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా సోమవారం వెల్లడించడంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి  మొదలైంది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ అధికారులు ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించి వివిధ పార్టీల ప్రతినిధులతో పాటు ఓటర్లు ఇచ్చిన ఫిర్యాదులు, సలహాలను ఆధారంగా పరిశీలన జరిపి, సోమవారం సాయంత్రం తుది ఓటర్ల జాబితా ప్రకటించారు.

వివిధ రాజకీయ పార్టీల ఈనెల 12న ఓటర్ల తుది జాబితా వార్డుల వారీగా ప్రకటించడంతోపాటు, పోలింగ్ కేంద్రాల ప్రకటన కూడా జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు తుది ఓటర్ల జాబితా సిద్ధం చేసిన మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్ ల భద్రత, తదితర ఏర్పాట్లను చేయడానికి నిమగ్నమయ్యారు.

చేరికలపై దృష్టి!

మున్సిపల్ ఎన్నికలు పార్టీ పరంగా అభ్యర్థులను నిలపాల్సి వస్తుండడంతో, రాజకీయ పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. అటు అధికార కాంగ్రెస్ బీఆర్‌ఎస్ ఇతర పార్టీల నుంచి నాయకులను, కార్యకర్తలను పార్టీలోకి చేర్పించుకోవడానికి వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే కేసముద్రంతో పాటు వివిధ మున్సిపాలిటీలో బలమైన బీఆర్‌ఎస్ నాయకులను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి కొంతమేర చేసిన ఫలితాలు అనుకూలించాయి. ఇదే తరహాలో మిగిలిన మరికొంతమందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

అయితే ఇటు బీఆర్‌ఎస్ నాయకులు కూడా మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి అధికార కాంగ్రెస్ కు ధీటుగానే ప్రయత్నాలను చేస్తున్నారు. దిగువ స్థాయి నేతలను కాంగ్రెస్ నుంచి బీ ఆర్ ఎస్ లో చేర్చుకోవడానికి మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ నేతృత్వంలో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలా ఎవరికి వారు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. 

అభ్యర్థుల ఎంపికలో పార్టీలో నేతలు

మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయడానికి అభ్యర్థులను ఎంపిక చేసే కార్యక్రమానికి రాజకీయ పార్టీలు శ్రీకారం చుట్టాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు ఇప్పటికే తమకు బలం ఉన్న వార్డుల్లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించాయి. ఇందులో ప్రధానంగా ఆర్థికంగా ఉన్నవారికి, అందులో సామాజికంగా గుర్తింపు ఉన్నవారికి పెద్దపీట వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అవసరమైన సన్నద్ధత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. వివిధ పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా ఎన్నికల చర్చే సాగుతోంది. రాజకీయ పార్టీలు ఎవరికి వారు ప్రత్యర్థి  అభ్యర్థుల పై ఆరా తీస్తున్నారు. అవతలి పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటున్నారు, వారికి దీటుగా తమ పార్టీ నుంచి అభ్యర్థులను రంగంలో దింపడానికి సమాలోచనలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో కోలాహలం నెలకొనగా, ఇప్పుడు మున్సిపాలిటీలో ఎన్నికల వేడి పుట్టించింది. వార్డు కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ ల రిజర్వేషన్ల ప్రకటన కోసం వేచి చూస్తున్నారు.