13-01-2026 02:51:14 AM
గద్వాల, జనవరి 12 : రైతులు ఈనెల 15వ తేదీకి లోపుల ఫార్మర్ రిజిస్ట్రీలో యాప్ లో నమోదు చేసుకొని పీఎం కిసాన్ లబ్ధిని పొందాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ తెలిపారు. సోమవారం గద్వాల మండలం వెంకంపేట రెవెన్యూ గ్రామంలోని నది అగ్రహారం గ్రామంలో రైతులతో సమావేశమై ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాలు గురించి వివరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం కిసాన్ పథకం లో ప్రతి అర్హ రైతుకు సంవత్సరానికి 6,000 నగదు లబ్ధి అందించబడుతుందని తెలిపారు. ఈ లబ్ధిని పొందడానికి రైతులు తప్పనిసరిగా ఈనెల 15వ తేదీకి ముందే ఫార్మర్ రిజిస్ట్రీ యాప్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
రైతులు తమ ఆధార్ నంబరు లింక్ చేయబడిన ఫోన్ నంబరుతో ఫార్మర్ రిజిస్ట్రీలో పూర్తి హిస్టరీ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ విధంగా నమోదు అయిన ప్రతి రైతుకు 11 అంకెల యూనిక్ రిజిస్ట్రేషన్ నంబరు కల్పించబడుతుందని తెలిపారు. భవిష్యత్తులో పీఎం కిసాన్ లబ్ధి పొందడానికి ఈ రిజిస్ట్రేషన్ నంబరు చాలా ముఖ్యమైనది తెలిపారు. కేవలం కేవైసీ చేయించిన, రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన రైతులకే లబ్ధి చేకూరు తుందని తెలిపారు. రైతులు ఈనెల 15వ తేదీకి ముందే, తమ గ్రామాల వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించవచ్చు లేదా మీ-సేవా కేంద్రాలు ద్వారా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారి హరీష్, సం బంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.