13-01-2026 02:31:53 AM
మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): సంక్రాంతి కానుకగా గోదావరిని ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అప్పగించారని, ముందు నుంచి అనుకున్నట్టే గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీష్‌రెడ్డి మాట్లాడారు. కోర్టులకు లాయర్లు వెళ్తారు కానీ మంత్రులు వెళ్లడం ఏంటి అని ప్రశ్నించారు. శాసన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వరాని వాళ్లు కోర్టుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని విమర్శించారు.
బలహీనమైన పిటిషన్ చెల్లదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, రాజకీయ ప్రయోజనాల కోసమే గోదావరి, కృష్ణా జలాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్‌లో చర్చ చేయకుండా కోర్టుకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. చంద్రబాబు చెవిలో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారని రేవంత్‌రెడ్డి చెప్పినప్పుడు.. బనకచర్ల ప్రాజెక్ట్ ఆపమని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనుమతిపై ఢిల్లీకి ఎందుకు పోవడం లేదన్నారు. బీజేపీ నుంచి రక్షణ పొందడానికే ఈ చీకటి ఒప్పందమని, కేసుల నుంచి కాపాడుకునేందుకు కృష్ణా, గోదావరి జలాలను అప్పజె ప్పుతున్నారని ఆరోపించారు.
నిద్రమత్తులో ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఏదేదో మాట్లాడారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు ఎలా వచ్చాయో ప్రజలకు తెలుసు అని తెలిపారు. పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొ ని ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, దొంగల చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణ ప్రజల్ని కాపాడుకునేందుకు కేసీఆర్ ఉన్నారని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డికి ప్లాట్ల దందా తప్ప మరోకటి తెలియదని, ఏ శాఖలో ఏం జరుగుతుందో మంత్రులకు తెలియడం లేదన్నారు. సమావేశంలో పల్లె రవికుమార్, కిషోర్‌గౌడ్ పాల్గొన్నారు.