calender_icon.png 13 January, 2026 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైళ్ల బాట పడుతున్న యువత

13-01-2026 01:49:23 AM

  1. పెరిగిన సైబర్, డ్రంకె డ్రైవ్ కేసులు
  2. ఒక్క ఏడాదిలోనే 11.8 శాతం పెరిగిన ఖైదీల సంఖ్య
  3. వారిలో 40 వేల మందికి పైగా కొత్త నేరస్థులే
  4. తెలంగాణ జైళ్ల శాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో సాంకేతికత పెరిగే కొద్దీ నేరాల తీరు మారుతోంది. సైబర్ నేరాలు, డ్రంకెన్ డ్రైవ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. సోమవారం చంచల్‌గూడలోని సీకా కార్యాలయంలో నిర్వహించిన వార్షిక సమావేశంలో జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి సంబంధించిన నేరాల గణాంకాలు, శాఖ పనితీరును ఆమె వివరించారు. గత ఏడాదితో పోలిస్తే జైళ్లకు వస్తున్న ఖైదీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో 38,079 మంది అడ్మిషన్లు ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య 42,566కు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే ఖైదీల సంఖ్యలో 11.8 శాతం పెరుగుదల నమోదైంది.

ప్రస్తుతం జైళ్లలో ఉన్నవారిలో 36,627 మంది అండర్ ట్రయల్ విచారణ ఖైదీలు కాగా, 5,056 మంది శిక్ష పడిన ఖైదీలు ఉన్నారు. శిక్ష పడిన ఖైదీల సంఖ్య గతంతో పోలిస్తే 81 శాతం పెరగడం గమనార్హం. సాధారణ నేరాలైన హత్యలు, పోక్సో, ఎన్డీపీఎస్, ఆస్తి తగాదాల్లో సగటున 11 శాతం పెరుగుదల కనిపిస్తుండగా.. సైబర్ క్రైమ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మాత్రం ఆందోళనకర స్థాయిలో వృద్ధి నమోదైంది. సైబర్ నేరాల్లో జైలుకు వస్తున్న వారి సంఖ్య ఏకంగా 135.6 శాతం పెరిగింది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ కేసుల్లో అడ్మిషన్లు 152 శాతం పెరిగాయి.

సాంకేతిక వినియోగంలో ముందంజ

ఖైదీలను కోర్టుల్లో హాజరుపరచడంలో జైళ్ల శాఖ సాంకేతికతను సమర్థవంతంగా వాడుకుంటోంది. 2023లో 37 శాతంగా ఉన్న వీడి యో కాన్ఫరెన్సింగ్ వినియోగం, 2025 నాటికి 69.47 శాతానికి పెరిగింది. దీనివల్ల సమ యం, ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా భ ద్రతా సమస్యలు తగ్గుతున్నాయి. ఫిజికల్ ప్రొ డక్షన్ రేటు కూడా 98.5 శాతంగా ఉంది.

పేద ఖైదీలకు అండగా న్యాయ సహాయం

పేద ఖైదీలకు న్యాయ సహాయం అందించడంలోనూ శాఖ ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 155 మంది లీగల్ ప్యానెల్ అడ్వకే ట్లు, 47 మంది పారా లీగల్ వాలంటీర్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. గత ఏడాది 6,573 మంది ఖైదీలు న్యాయ సహాయం పొందగా, వారిలో 3,635 మంది బెయిల్ లేదా విడుదల పొందగలిగారు. ఖైదీల ప్రవర్తనలో మా ర్పు తెచ్చి, వారికి నైపున్యాభివృద్ధిని అందించి సమాజంలో గౌరవప్రదంగా బతికేలా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని డీజీ సౌమ్య మిశ్రా స్ప ష్టం చేశారు. సమావేశంలో ఐజీలు యెర్రంశెట్టి రాజేష్, ఎన్ మురళీబాబు, డీఐజీలు డా. డి శ్రీనివాస్, ఎం సంపత్ పాల్గొన్నారు.

యువతే అధికం.. కొత్తవారే ఎక్కువ

18 నుంచి 30 ఏళ్లు, 31 నుంచి 50 ఏళ్ల వయసు వారిలోనే నేర ప్రవృత్తి ఎక్కువగా కనిపిస్తోంది. వీరి అడ్మిషన్లలో 11 నుంచి 13 శాతం పె రుగుదల ఉండ గా, 50 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 2 శాతం మాత్రమే పెరుగుదల ఉంది. ఇక జైళ్లకు వస్తున్న వారిలో పాత నేరస్తుల కంటే, మొదటిసారి నేరం చేసి వస్తున్న వారే అత్య ధికంగా ఉన్నారు. మొత్తం అడ్మిషన్లలో 40,090 మంది మొదటిసారి నేరం చేసినవారు కాగా, కేవలం 2,496 మంది మాత్రమే పాత నేరస్తు లు ఉన్నారు. మరోవైపు విదేశీ ఖైదీల సంఖ్య 107 నుంచి 74కు తగ్గింది.