calender_icon.png 13 January, 2026 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్సీ ఎప్పుడు?

13-01-2026 01:46:25 AM

నోటిఫికేషన్లలో కాలయాపన!

  1. గత 20 ఏండ్లలో వచ్చినవి ఐదు మాత్రమే
  2. ప్రత్యేక రాష్ట్రంలో కేవలం రెండే నోటిఫికేషన్లు 
  3. ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వేయకుండా కుట్ర
  4. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీచేయాలి
  5. జాబ్ క్యాలెండర్ ప్రకారం.. గతేడాది ఫిబ్రవరిలోనే వెలువడాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): డీఎస్సీ నోటిఫికేషన్ల జారీలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్న తాత్సారంతో ఉపాధ్యాయ వృత్తి ఎంచుకోవాల నుకునే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటవెంటనే డీఎస్సీ నోటిఫికే షన్లు వేయకపోవడంతో చాలామంది అభ్యర్థులు అర్హతను, ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తోంది. టీచర్ ఉద్యో గం చేయాలనుకునేవారి ఆశలు కల్లలవుతున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 ఏళ్లలో అటు ఉమ్మ డి రాష్ట్రం, ఇటు ప్రత్యేక రాష్ట్రంలో కలిపి కేవలం ఐదు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్లు జారీచేశారు. ఉద్యోగ పదవీ విరమ ణ ద్వారా ఖాళీలను వెనువెంటనే భర్తీచేయకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. పైగా అర్హతను కూడా కోల్పోవాల్సి వస్తోంది. వెరసి టీచర్ ఉద్యోగం చేయాలనుకునే తమ కల కల్లగానే మిగిలిపోతుందంటున్నారు. 

ఏపీలో 3.. మనదగ్గర రెండే!

2006 నుంచి ఇప్పటివరకు అంటే 20 ఏళ్లలో కేవలం ఐదు డీఎస్సీ నోటిఫికేషన్లు మాత్రమే వేశారు. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006లో ఒకటి, 2008లో, 2012లో డీఎస్సీ నోటిఫికేషన్లు వేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణలో 2017, 2024లో రెండు డీఎస్సీ నోటిఫికేషన్లు వచ్చాయి. అదే ఏపీలో మూడు డీఎస్సీలు వేశారు. 2014, 2018, 2023లో వేశారు. మళ్లీ ఫిబ్రవరిలో వేసేందుకు ఏపీ ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. కానీ మనదగ్గర ఇంత వరకూ మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఊసేలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం గతేడాది ఫిబ్రవరిలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలి కానీ, నోటిఫికేషన్ ఉంటుందా? ఉండదా? అనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వడంలేదు.

నిరుద్యోగులు మాత్రం నోటిఫికేషన్ కో సం ఎదురుచూస్తూ అర్హతను కోల్పోయే పరిస్థితి ఉంది. ఓసీలకు వయస్సు 39, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 42 ప్లస్ 10 ఏళ్లు వరకు డీఎస్సీని రాసుకునే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమల్లోకి రావడంతో వారికి 39 ప్లస్ 10 సంవత్సరాలు వయస్సు అర్హత ఇచ్చారు. వయస్సు సడలింపు ఇచ్చినప్పటికినీ సంవత్సరాల తరబడి చదవాలనే ఆసక్తి నోటిఫికేషన్ జాప్యం కారణంగా సన్నగిల్లుతోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

టీచర్ ఖాళీలు 19 వేలు..

పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం గతేడాది ఆగస్టు 31 వరకు ఉన్న వివరాల ప్రకారం మొత్తం సాంక్షన్డ్ టీచర్ పోస్టులు 1,25,583 ఉంటే, అందులో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు 1,06,566 మంది ఉండగా, 19,017 ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా గెజిటెడ్ హెడ్మాస్టర్ ఖాళీలు 422, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ం 651, ఎస్జీటీ పోస్టులు 10,395 ఉండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 4,484, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 293, పీఈటీ పోస్టులు 313, వొకేషనల్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ ఇతరత్ర పోస్టులు 2,459 ఖాళీలున్నాయి.

నాన్ టీచింగ్ పోస్టుల్లో పనిచేస్తున్నవారు 2,686 మంది ఉన్నారు. అయితే వీటిలో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ల ద్వారా గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టులు భర్తీ చేయగా, 70 శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్జీటీలతో ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి, మిగిలిన 30 శాతం పోస్టులను మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించింది. ఇలా ప్రమోషన్లు, పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీ లు, ఇప్పటికే ఉన్న ఖాళీలను కలుపుకుంటే మొత్తం 19 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్న ట్లు గుర్తించారు.

నోటిఫికేషన్లు వెంటనే వేయాలి..

డీఎస్సీ కోసం దాదాపు రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. టెట్ నోటిఫికేషన్లు ఏడాదికి రెండుసార్లు వేస్తున్న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూడా ఏడాదికో, రెండేళ్లకోసారి వేయాలని డిమాండ్ చే స్తున్నారు. పదవీ విరమణ పొందిన ఖాళీలను వెనువెంటనే భర్తీ చేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి ఉండదు. కానీ, ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వేసి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉంది. 2018 నవంబర్, 2023 అసెం బ్లీ ఎన్నికల సమయంలోనే డీఎస్సీ నోటిఫికేషన్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బీఆ ర్‌ఎస్ 2023లో 5 వేల పోస్టులతో వేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి 11 వేల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు.

అయితే ఇందులో 10,500 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. 2024 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడు వేల మంది రిటైరయ్యారు. గతంలో ప్రభుత్వం 6 వేల పోస్టులతో డీఎస్సీ వేస్తామని పలుమార్లు ప్రకటించింది. కనీసం 14 వేల ఖాళీలైన ఉం టాయి. ప్రభుత్వమేమో రేషనలైజేషన్ చేస్తామని ప్రకటించడంతో ఖాళీల సంఖ్య తగ్గే అవ కాశం ఉంది. 30 మంది విద్యార్థులకు ఒక టీచ ర్ ఉండాలి.

కానీ మనదగ్గర 17 మందికి ఒకరు ఉన్నారని, మిగులు టీచర్లున్నారని ప్రభుత్వం అంటోంది. ఈక్రమంలో ఎక్కువ ఉన్న చోటు నుంచి తక్కువ టీచర్లు ఉన్న చోటుకి టీచర్లను రేషనలైజేషన్ చేయడం ద్వారా పోస్టులు తగ్గే అవకాశముంది. దీంతో ఖాళీల సంఖ్య తగ్గుతుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నా రు. రేషనలైజేషన్‌తో సంబంధం లేకుండా కనీసం పది వేల పోస్టులకు తక్కువ కాకుండా నోటిఫికేషన్ వేయాలని కోరుతున్నారు. 


గత డీఎస్సీల్లో టీచర్ల పోస్టులు ఇలా..

* 2024లో 11,066 పోస్టులతో నోటిఫికేషన్ వేయగా, అందులో 10,500 వరకు భర్తీ చేశారు.

* 2017లో 8,792 పోస్టులతో నోటిఫికేషన్ వేసి దాదాపు 8 వేలు భర్తీ చేశారు. కొందరికి వేరే ఉద్యోగాలు కూడా రావడంతో అందులో ఖాళీలు మిగిలాయి.

* 2012లో 20 వేల పోస్టులతో నోటిఫికేషన్.. దీంట్లో తెలంగాణకు 9 వేల పోస్టులు