13-01-2026 01:32:03 AM
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి) : పోలవరం-నల్లమలసాగర్ అం శంపై రిట్ పిటిషన్ ద్వారా ముందుకు వెళ్లడం ప్రయోజనకరం కాదని, ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించా రు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు రిట్ పిటిషన్ సరైన మార్గంకాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలవరం- నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటి షన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ అధికారికంగా ప్రకటించారు. పిటిషన్ ఉపసం హరణ నేపథ్యంలో కేసును డిస్పోజ్డ్ ఆఫ్ చేసినట్టుగా ధర్మాసనం వెల్లడించింది.
నల్లమలసాగర్ ప్రాజెక్టుపై తమ వాదనలు, అభ్యంతరాలను వినిపించాలంటే సివిల్ సూట్ దాఖలు చేసుకోవడమే సరైన న్యాయపరమైన మార్గమని సూచించింది. మధ్యవర్తిత్వం ద్వారా జల వివాదాల ను పరిష్కరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ వద్ద తెలంగాణ వాదనలు వినిపించుకోవచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో నల్లమలసాగర్ అంశం భవిష్యత్‌లో సివిల్ సూట్ రూపంలో మరోసారి కోర్టు ముందుకు వ చ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రాల మధ్య ఉండే జల వివాదాలను ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్‌గా కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ద్వారానే పరిష్కరించుకోవాలని కోర్టు సూచించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కర్ణాటక, మహారాష్ర్టలను కూడా ప్రతివాదులుగా చేర్చుతూ ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ హాజరై వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండానే డీపీఆర్ పనులు చేపడుతోందని, ఇది తెలంగాణ జల ప్రయోజనాలకు విఘాతమని వాదించారు. అయితే, కోర్టు సూచనల మేరకు సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. ఈ వివాదం కేవలం రెండు తెలు గు రాష్ట్రాలకే పరిమితం కాలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. గోదావరి జలాల పంపిణీలో కర్ణాటక, మహారాష్ర్ట రాష్ట్రాలకు కూ డా సంబంధం ఉన్నందున, వారిని కూడా ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
రిట్ పిటిషన్‌లోని అంశాలు..
పోలవరం ప్రాజెక్ట్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా గోదావరి నీటిని మళ్లి స్తూ తెలంగాణ హక్కులను ఉల్లంఘిస్తున్నదని పేర్కొంటూ, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ పూర్తిగా నిర్వహణయోగ్యమేనని తెలంగాణ స్పష్టం చేసింది. గోదావరి జల వివాద ట్రి బ్యునల్ (జీడబ్ల్యూడీటీ) అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీరు మొత్తం 484.5 టీఎంసీలు మాత్రమేనని గుర్తుచేసింది. అయితే వరద నీటిని వినియోగిస్తున్నామన్న నెపం తో ఈ పరిమితిని మించి నీటిని మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. పోలవరం ప్రాజెక్ట్‌లో అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ నీటిని తీసుకునే సామర్థ్యం గల మౌలిక వసతులను ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్నదని తెలంగాణ తన పిటిషన్‌లో పేర్కొంది.
ఇది తెలంగాణకు కేటాయించిన నీటి హక్కులపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి నదీ యాజమాన్య మండలి (జీఆర్‌ఎంబీ), కృష్ణా నదీ యాజమాన్య మండలి (కేఆర్‌ఎంబీ), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), పర్యావరణ శాఖ వంటి సంస్థల అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నట్లు ఆరోపించింది. పోలవరం ప్రాజెక్ట్‌లో మార్పులు చేయడానికి కేవలం కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉందని, రాష్ర్ట ప్రభుత్వానికి అలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. 2017, 2025 సంవత్సరాల్లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) జారీ చేసిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహిరంగంగా ఉల్లంఘించిందని తెలంగాణ ఆరోపించింది.
ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర సంస్థలే లేఖల ద్వారా ధ్రువీకరించాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, జలశక్తి మంత్రిత్వ శాఖ వంటి సంస్థలు తీవ్రంగా తప్పుబట్టినట్టు తెలంగాణ వివరించింది. ఇవన్నీ అధికారిక లేఖల రూపంలో ఉన్నాయని పేర్కొంది. ఈ కేసు నీటి వాటాల నిర్ణయానికి సంబంధించినది కాదని, కేంద్ర మార్గదర్శకాలు, ట్రిబ్యునల్ అవార్డు ఉల్లంఘనలపై దాఖలైన పిటిషన్ మాత్రమేనని తెలంగాణ వాదించింది.
అందువల్ల ఆర్టికల్ 262 లేదా జల వివాదాల చట్టం వర్తించదని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎలాంటి జల వివాద ట్రిబ్యునల్ లేకపోవడంతో, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు జోక్యం తప్పనిసరి అని తెలంగాణ పేర్కొంది. ట్రిబ్యునల్ ఏర్పాటు అయ్యే వరకు పరిస్థితి మారిపోకుండా ఉండేందుకు తక్షణ ఆదేశాలు అవసరమని కోరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం పోలవరం పేరుతో ఇప్పటికే ఉన్న స్థితిగతులను మార్చి, తిరిగి సరిదిద్దలేని పరిస్థితి సృష్టించే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ ఆరోపించింది. అందు కే ఏకపక్ష నిర్మాణాలపై తక్షణ స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది.