13-01-2026 03:02:08 AM
ముగ్గుల పోటీల్లో కార్మికులకు బహుమతుల ప్రదానం
స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్, జనవరి 12 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సోమవారం నిర్వహించిన సఫాయి కార్మికుల ముగ్గుల పోటీల బహుమతుల ప్రదాన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి పాల్గొని సఫాయి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, ఆసుపత్రి పరిశుభ్రతలో సఫాయి కార్మికుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఆసుపత్రిలో శుభ్రత అనేది కేవలం పని మాత్రమే కాదని, అది రోగులకు నమ్మకాన్ని, వైద్యులకు ధైర్యాన్ని కలిగిస్తుందన్నారు. సఫాయి కార్మికులు నిశ్శబ్దంగా చేసే సేవల వల్లే అనేక మంది ఆరోగ్యంగా ఇంటికి చేరుతున్నారని తెలిపారు. ముగ్గుల పోటీల్లో సఫాయి కార్మికులు చూపించిన ప్రతిభ ప్రశంసనీయమని, వారు కేవలం కార్మికులే కాకుండా కళాత్మక ప్రతిభ కలిగినవారని ఎమ్మెల్యే అభినందించారు.
వారి శ్రమకు సమాజం రుణపడి ఉంటుందని, ఆత్మగౌరవంతో ముందుకు సాగాలని సూచించారు. సంక్రాంతి పండుగ కష్టం, ఐక్యత, శ్రమకు గుర్తింపు అనే సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు, సఫాయి కార్మికులు భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో పనిచేసి నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెం డెంట్ డాక్టర్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించగా, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, సఫాయి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అంతర్గత సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.