01-07-2024 12:05:00 AM
దర్శకుడు ప్రశాంత్ వర్మకు దేశ వ్యాప్తంగా గుర్తింపుతెచ్చిన ‘హనుమాన్’ చిత్రంలో ‘కోటి’ అనే కోతి పాత్రకు వాయిస్ ఓవర్ అందించారు హీరో రవితేజ. దీనికి ముందు కూడా దర్శకుడికి తొలి చిత్రమైన ‘అ..’లో చంటి అనే ఒ చెట్టు పాత్రకి గాత్రమందించిన రవితేజ, ప్రశాంత్ వర్మ కలయికలో ఓ సినిమా రానున్నట్టు తాజా సమాచారం. ప్రశాంత్ మీద నమ్మకంతో రవితేజ ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే కథ విషయంలో రకరకాల అంశాలు చర్చకొస్తున్నాయి.
ప్రశాంత్ వర్మ సినిమేటిక్ యూనివర్స్‌లో భాగంగా కోటి పాత్రతోనే పూర్తి నిడివి గల సినిమా చేయనున్నారా? లేక దీనితో ఎలాంటి సంబంధం లేకుండా రవితేజతో మరేదైనా కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మొన్నటికిమొన్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌తో ప్రశాంత్ సినిమా ఆగిపోయినట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ కథతోనే ఇప్పుడు రవితేజ సినిమాని పట్టాలెక్కిస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో స్పష్టత రావాలంటే వారి నుంచి స్పందన రావాల్సిందే. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సీక్వెల్ పనుల్లో ఉండగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ముగించుకొని భాను భోగవరపుతో చేయనున్న సినిమాని సంక్రాంతికి సిద్ధం చేయనున్నారు రవితేజ.