calender_icon.png 11 November, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టుదలతో లక్ష్యం దిశగా..

02-07-2024 12:05:00 AM

కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు అర్జున్, అందాల తార త్రిష కాంబో అనగానే అందరికీ గుర్తుకొచ్చే సినిమా ‘మంగాత’ (తెలుగులో ‘గ్యాంబ్లర్’). ఈ నట త్రయం మరోమారు ఒకే స్క్రీన్‌పై అలరించబోతోంది. ఈ ముగ్గురూ ముఖ్య తారాగణంగా లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఆ తాజా చిత్రమే ‘విడాముయర్చి’. ఇంకా ఈ సినిమాలో ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి సుభాస్కరన్ నిర్మాత. ఈ సినిమాకు సంబంధించి హీరో అజిత్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు.

లక్ష్య సాధన కోసం పట్టుదలతో ముందుకు సాగే వ్యక్తిగా అజయ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్టు తాజా లుక్ చూస్తే అర్థమవుతోంది. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జీకేఎం తమిళ్ కుమారన్ మాట్లాడుతూ.. “మా బ్యానర్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ‘విడాముయర్చి’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అజిత్‌తో సినిమా చేస్తున్నామని ప్రకటించినప్పటి నుంచి అభిమానులు, ప్రేక్షకులంతా సపోర్ట్ చేస్తున్నారు. వారికి చక్కటి సినిమాను అందించేందుకు మా టీమ్ ఎంతగానో కష్టపడుతోంది” అని తెలిపారు.

ఈ చిత్రం గురించి ఆయన ఇంకా చెప్తూ.. ‘ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు నెలాఖరుకల్లా చిత్రీకరణ పూర్తి చేస్తాం.. ఆ తర్వాతే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తుండగా, ఓం ప్రకాశ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించి శాటిలైట్ హక్కులను ‘సన్ టీవీ’ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులు ‘నెట్‌ఫ్లిక్స్’కు దక్కాయి.