24-07-2024 09:37:57 AM
హైదరాబాద్: కుల్సుంపురాపోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వనగర్ లో నాలుగు అంతస్థుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. బిల్డింగ్ గ్రౌండ్ ప్లోర్ లో ఉన్న సోఫా తయారీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సోఫా తయారీ గోదాం నాలుగు అంతస్థుల బిల్డింగ్ లో గ్రౌండ్ భాగంలో ఉన్నది. మంటలు ఫస్ట్ ఫ్లోర్ కు వ్యాపించాయి. దీంతో మంటల్లో దాదాపు 20 మంది చిక్కుకున్నారు. మంటలు అంటుకున్న వెంటనే స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులుండగా ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబం సోపా తయారీగోదాంలో పనిచేస్తోంది. శ్రీనివాస్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి గోదాం ఉన్న ఇంటిలోనే ఓ రూంలో ఉంటున్నాడు. శ్రీనివాస్ ఉంటున్న రూమ్ లో యజమాని సోపా తయారీ మేటిరీయల్ పెట్టినట్లు తెలుస్తోంది. మంటలంటుకున్న సమయంలో రూంలో సోపా మెటీరియల్ ఉండడంతో శ్రీనివాస్ కుటుంబం బయటకు రాలేరకపోయింది. గాయపడిన వారు ఒకే కుటుంబానికి చెందిన శివప్రియ(10), శ్రీనివాస్(40), నాగరాణి(35)భార్య,హరిణి(6)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.