19-11-2025 04:41:40 PM
బేల (విజయక్రాంతి): గుండెనొప్పి వచ్చినప్పుడు మనిషిని బ్రతికించేందుకు చేసే కార్డియోపల్మనరీ రిససిటేషన్(సీపీఆర్) పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని బేల మండల మెడికల్ ఆఫీసర్ వంశీ కృష్ణ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బేల పోలీస్ స్టేషన్ లో బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో సీఐ శ్రవణ్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఆర్ పైన అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా రోడ్డు భద్రతలో భాగంగా పలువురికి ప్రథమ చికిత్స బాక్స్ లను అందజేశారు.
ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోటు వలన అనేక మంది వారి విలువైన ప్రాణాలు కొలపుతున్నారని, దీని నివారణకు సీపీఆర్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని పేర్కొన్నారు. సీపీఆర్ వలన ఆకస్మిక గుండెపోటు నుంచి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరు ఈ మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు గాయపడ్డ వ్యక్తికి ప్రథమ చికిత్స అందించేదనిపై వివరించారు.