calender_icon.png 19 November, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభించకపోతే.. నిరాహార దీక్షలు

19-11-2025 04:49:11 PM

👉ఏళ్ళు గడుస్తున్నా ప్రారంభించని విద్యుత్తు కేంద్రం..

👉లోవోల్టేజీ సమస్యతో పాటు విద్యుత్ కోతలతో సాగు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం.

👉 ప్రకృతి కన్నెర్రతో ఖరీఫ్ లో నష్టం.

👉యాసంగిలో నైనా కొంతమేర నష్టాన్ని పూడ్చు కుందామనుకున్న రైతులకు లోవోల్టేజి వెంటాడు తుంది

👉 విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందిచాలి.  

 👉కుభీర్ లో 13 గ్రామాల రైతులతో నిరాహార దీక్ష చేపడతాం

👉 హెచ్చరిస్తున్న మాలేగాం పరిధిలోని సాగు రైతులు

కుభీర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మాలేగాం గ్రామంలో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం 2022 లో రూ. 1కోటి 10 లక్షలతో విద్యుత్ ఉప కేంద్రం మంజూరు చేసి పనులను సైతం ప్రారంభించింది. అంతలోనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది. విద్యుత్ ఉప కేంద్రం పనులన్నీ పూర్తయి రెండేళ్లు గడిచిపోతున్నా దాన్ని ప్రారంభించేందుకు ఆ శాఖ అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చుట్టుపక్కల 13 గ్రామాల రైతులకు సమస్య వేధిస్తోంది. యాసంగి ప్రారంభం కాగానే మొక్కజొన్న, నువ్వు, శనగ తదితర పంటలు సాగు చేసిన రైతులకు సాగు చేసిన భూములకు నీరు పారడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒకరోజు దినంలో కనీసం రెండు పట్టెలు కూడా పారడం లేదని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్ జిల్లా విద్యుత్ శాఖ అధికారి స్పందించి మాలేగాంలో నిర్మించి పనులు పూర్తయిన విద్యుత్ ఉప కేంద్రాన్ని వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. మండల రైతులు ఖరీఫ్ లో సాగు చేసిన పంటలు అధిక వర్షాల వల్ల ప్రకృతి కన్నెర్రతో సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక తీవ్ర నష్టాల్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే. "అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని" అన్న చందంగా  మారిందని పంటలు సాగుచేసిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

జిల్లా అధికారుల నిర్లక్ష్యం, ముందు చూపులేని విద్యుత్ శాఖ అధికారుల కారణంగా రైతులు దినమంతా పంపు సెట్ల ద్వారా కనీసం అరా ఎకరానికి కూడా నీరందించలేని పరిస్థితి ఏర్పడిందని అనధికారిక విద్యుత్ కోతలు, తరచూ ఎల్సి ఇవ్వడం, మరమ్మత్తుల పేరిట విద్యుత్ సరఫరాలో అంతరాయం, ముఖ్యంగా లోవోల్టేజీ సమస్య రైతులను వేధిస్తోంది. మాలేగాంతో పాటు చుట్టుపక్కల 15 గ్రామాలకు విద్యుత్ సమస్య వెంటాడడంతో సాగుచేసిన పంటలు ఎండిపోతాయన్న భయం రైతులను పట్టిపీడిస్తోంది. గతేడాది యాసంగిలో విద్యుత్ సమస్యలు తలెత్తి కుంటాల మండలం లోని ఓలా ఇతర సబ్ స్టేషన్ ల నుండి ప్రత్యేక లైన్ వేసి మండల రైతులకు విద్యుత్ సరఫరా చేశారు.

ఈ యేడు వర్షాలు అధికంగా కురిసిన నేపథ్యంలో శనగ తోపాటు మొక్కజొన్న,నువ్వు తదితర పంటలు ఈపాటికే యాభై శాతం రైతులు సాగు చేశారు. గతేడాది ఈ యేడు యాసంగి లో సాగు విస్తీర్ణం రెట్టింపు అయ్యింది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్ కు ముందే పంటలు సాగు చేయవద్దని విద్యుత్ శాఖ అధికారులు  గ్రామాల ప్రజలకు చెప్పినట్లయితే పంటలను ఎందుకు సాగు చేసుకునే వారము. సాగు చేసుకున్న తర్వాత ఈ కరెంటు కోతల బాధ విధిస్తున్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు విద్యుత్ శాఖ జిల్లా అధికారులు స్పందించి వెంటనే మలేగాంలో నిర్మించి పూర్తి చేసిన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించి సాగు రైతులను ఆదుకోవాలి. లేనిపక్షంలో రైతుల అందరితో కలిసి కుభీర్ విద్యుత్ ఉపకేంద్రం ముందు నిరాహార దీక్షలు చేస్తాం.

👉 సబ్ స్టేషన్ ను ప్రారంభించి నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయండి: కచ్చకాయల శంకర్, రైతు, మాలేగాం

నేను 10 ఎకరాల్లో మొక్కజొన్న, పసుపు సాగు చేశాను. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం, లోవోల్టేజి మూలంగా దినమంతా నీరిస్తే ఒక పట్టే తడవడం లేదు. కెసిఆర్ ప్రభుత్వంలో రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించి కనురెప్పపాటు కూడా కరెంటు పోకుండా రైతులకు భరోసా కల్పించారు. మున్ముందు రైతులకు లోవోల్టేజీ సమస్య తలెత్తకుండా విద్యుత్ ఉప కేంద్రం నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ దాన్ని ప్రారంభించకపోవడం ఈ ప్రాంత రైతులను మోసం చేయడమే అవుతుంది.  

👉 రైతులకు కరెంటు కష్టాలు: బంజ గణేష్, రైతు, మాలేగాం

నేను సుమారు 20 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. బోరుబావుల్లో పుష్కలంగా నీరున్నా.. సాగు చేసిన భూమిని తడపడం కష్టంగా మారింది. ఒక గంటలో పదిసార్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కన్నులుండి చూడలేని గుడ్డి ప్రభుత్వమిది. విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభించక రెండేళ్లు గడిచి పోతున్నా రైతులపై కనికరం లేదు. ప్రస్తుతం పంటలు సాగుచేసిన రైతుల పరిస్థితి  'కొరకరాని కొయ్య' లా తయారైంది. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే మలేగాంలోని విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించాలి.