03-01-2026 12:00:00 AM
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ
కలుషిత నీరు తాగి పది మంది మృతి ఘటనపై ఫైర్
భోపాల్, జనవరి ౨: మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఇండోర్ నగరవాసులకు సరఫరా చేసేది మంచినీరు కాదని.. కాలకూట విషమని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. కలుషిత నీరు తాగి ఇండోర్‌లో పది మంది మృతిచెందడం, వందలాది మంది జబ్బుల బారిన పడిన ఘటనపై శుక్రవారం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కలుషిత నీరు తాగి ఇప్పటికీ ౩౦మంది వరకు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారని పేర్కొన్నారు.
మరణాలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇండోర్ మున్సిపల్ యంత్రాంగం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని, నగరవాసులకు సురక్షిత నీరు సరఫరా చేయాలని చురకలంటించారు. ఇండోర్‌లోని భగీరథపుర ప్రాంతంలో మురుగు పైపుల్లోకి ఎలా చేరుతోందని ప్రశ్నించారు. దుర్వాసన వస్తున్న నీరు సరఫరా అవుతోందని ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందని డిమాండ్ చేశారు. స్వచ్ఛమైన నీరు సరఫరా చేయడం ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న ఉపకారం కాదని, అది ప్రజల ప్రాథమిక హక్కు అని గుర్తుచేశారు.