03-01-2026 12:00:00 AM
బెంగళూరు, జనవరి ౨: ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల)పై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని కర్ణాటకలో నిర్వహించిన ఓ తాజా సర్వే స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలపై ప్రజలకున్న నమ్మకాలను అంచనా వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఈ సర్వే నిర్వహించింది.
ఆ సంస్థ బెంగళూరు, బెల్గాం, కలబురగి, మైసూరుతో పాటు మొత్తం 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేపట్టింది. సర్వేలో మొత్తం 5,100 మంది పాల్గొనగా, వీరిలో 83.61 శాతం మంది ఈవీఎంలపై తమకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని స్పష్టంగా వెల్లడించడం విశేషం. అత్యధికంగా కలబురగి నియోజవకర్గంలో 94.48 శాతం మంది ఈవీఎంలపై విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే మైసూరు నియోజకవర్గంలో 88.59 శాతం, బెల్గాం నియోజకవర్గంలో 85.33 శాతం మంది యంత్రాలను సమర్థించారు. రాష్ట్ర రాజధాని బెంగళూరులో 85 శాతం మంది ఈవీఎంలపై విశ్వాసం వ్యక్తం చేశారు.
రాహుల్‌గాంధీపై విమర్శల వెల్లువ
సర్వే ఫలితాలు వెలువడిన వెంటనే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విమర్శలు గుప్పించారు. బీజేపీ దేశవ్యాప్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్ చేస్తున్నదని గతంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను గుర్తుచేస్తూ, తాజా సర్వే రాహుల్‌గాంధీకి చెంపదెబ్బ వంటిదని పేర్కొంటున్నారు. బీజేపీ నేత ఆర్.అశోక్ స్పందిస్తూ.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ఎన్నికల వ్యవస్థను నమ్మలేమని, ఈవీఎంలను విశ్వసించలేమని రాహుల్ గాంధీ లేనిపోని రాద్ధాంతం సృష్టించారని మండిపడ్డారు.
తాజా సర్వేతో రాహుల్ చెబుతున్న కథలన్నీ అబద్ధాలని ప్రజలే తేల్చేశారని పేర్కొన్నారు. సర్వేపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ.. ఈ సర్వేను కర్ణాటక ప్రభుత్వం నిర్వహించలేదని, కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఒక ప్రభుత్వ సంస్థ దీనిని ప్రచురించిందని ఆయన తెలిపారు. ఈవీఎంలపై సర్వేను గొప్పగా చెప్పుకొంటున్న బీజేపీ నేతలు.. రాష్ట్రంలోని అలంద్ నియోజకవర్గంలో జరిగిన ‘ఓట్ చోరీ’పై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.