03-01-2026 12:00:00 AM
మార్కెట్లో 1౦, 50 కరెన్సీ నోట్ల షార్టేజీ
వెలవెలబోతున్న సామాన్యుడి జేబు
న్యూఢిల్లీ, జనవరి 2: సామాన్యుడి జేబులో నిత్యం సందడి చేసే రూ.పది నోటు ఇప్పుడు మార్కెట్లో కనుమరుగవుతూ చిల్లర కష్టాలను పెంచుతున్నది. నిత్యావసరాలు, కూరగాయల మార్కెట్లు, టీ కొట్లు, బస్సు ప్రయాణాల్లో అత్యవసరమైన ఈ చిన్న నోటు షార్టేజీ ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త నోట్ల ముద్రణ ఆగిపోయిందనే ప్రచారం నేపథ్యంలో వినియోగదారులు పాతనోట్లనే భయం భయంగా వినియోగిస్తూ వస్తున్నారు. రూ.పది నోటుతోపాటు కొన్నిచోట్ల రూ.౫౦ నోట్ల కొరత కూడా కనిపిస్తోంది. చిన్న నోట్ల జీవితకాలం తక్కువగా ఉండటంతో వాటి స్థానంలో నాణేలను ప్రోత్సహించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రూ.౧౦ నాణేలు చెల్లుతాయని ఆర్బీఐ పదే పదే చెబుతున్నప్పటికీ, కొన్నిచోట్ల ఆ నాణేలు తిరస్కరణకు గురవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో రూ.౫౦౦ నోట్ల చలామణిపైనా రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వచ్చే మార్చి నాటికి ఏటీఎంల నుంచి రూ.౫౦౦ నోట్లు తొలగిస్తారనే వార్తలు వినవస్తుండటంతో జనం గందరగోళానికి గురవుతున్నారు. అయితే.. ఆ తరహా ప్రచారంపై తాజాగా కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ విభాగం స్పందించింది. కేంద్రానికి రూ.౫౦౦ నోట్లను రద్దు చేసే ఆలోచనే లేదని తేల్చిచెప్పింది. ఏఐ సాంకేతికతను వినియోగించి కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది.