calender_icon.png 13 January, 2026 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరుదైన మొక్కలకు అగ్నిప్రమాదం

13-01-2026 02:02:24 AM

ములుగు,జనవరి12(విజయక్రాంతి): ప్రపంచ ప్రఖ్యాత గాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సమీపంలో ఉన్న కేన్ ప్రాంతం జైవైవిధ్యంతో సమృద్ధిగా ఉన్న హాట్స్పాట్గా గుర్తింపు పొందింది. ఇక్కడ స్వాంప్ అటవీ ప్రాంతం, తెలంగాణలో అరుదైన కలామస్ రోటాంగ్ కు చివరి నివాసం. అలాగే 125 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. అయితే అక్రమ ఆక్రమణలు, మానవ సృష్టి అగ్ని ప్రమాదాల కారణంగా ఈ అటవీ విస్తీర్ణం 51 ఎకరాల నుంచి కేవలం 5 ఎకరాలకు తీవ్రంగా క్షీణించింది. ఈ ప్రత్యేక పర్యావరణ వ్యవస్థలో అర్జున చెట్లుపై అంతరించిపోతున్న ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ కు కీలక విశ్రాంతి స్థలం ఉంది. అదేవిధంగా 120కి పైగా పక్షి జాతులు మరియు విభిన్న జలచర జీవజాతులు ఇక్కడ ఆధారపడి జీవిస్తుండేవి.

కేన్ మొక్కల ప్రాంతంలో అగ్నిప్రమాదం

పాలంపేట గ్రామ పరిధిలోని కేన్ మొక్కల పొదల్లో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సమయంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు గాలివాటంతో వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక వాహనాలు, పైపుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కేన్ మొక్కలు ఉన్న ప్రాంతానికి మంటలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

కేన్ మొక్కలు ఉన్న ప్రాంతంలో కావాలనే ఎవరైనా దుండగులు నిప్పు పెట్టారా.. లేదా అనే కోణంలో ఎస్త్స్ర చల్లా రాజు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. అయితే కేన్ మొక్కలు కొంత మేరకు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కేన్ మొక్కల ప్రాంతాలలో, పొదల్లో నిప్పు వాడకంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.