calender_icon.png 10 July, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచిర్యాల సర్కిల్‌లో ఐదు కొత్త సబ్ స్టేషన్లు

10-07-2025 12:36:32 AM

  1. అడ్వాన్సుడ్ టెక్నాలజీ పరికరాలతో నిర్మాణం...
  2. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు శ్రీకారం ఎస్‌ఈ ఉత్తం ఝాడే 

మంచిర్యాల, జూలై 9 (విజయక్రాంతి) : విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు పూనుకున్నారు. జిల్లాలో ఐదు కొత్త సబ్ స్టేషన్లు మంజూరు చేశారు. పనులు సైతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

డిమాండ్‌కు అనుగుణంగా అవసరమయ్యే విద్యుత్ ను అందించేందుకు అవసరమైన చోట సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నారు. మునుముందు వినియోగదారులకు లో వోల్టేజ్ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు.

విద్యుత్ డిమాండ్ కు అనుకూలంగా...

నిరంతరం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంలో ఈ సబ్ స్టేషన్లు కీలకంగా మారనున్నాయి. రైతులకు కొత్త వ్యవసాయ కనెక్షన్లు త్వరగా మంజూరయ్యేలా వీటి ద్వారా సహకారం అందుతుంది. సాగు, గృహ, వాణిజ్య అవసరాల నిమిత్తం వినియోగదారులు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు నూతన సబ్ స్టేషన్లు దోహదం చేయనున్నాయి.

అంతేకాకుండా ఈ స్టేషన్లలో ఆధునిక సాంకేతికత అమలు చేయడంతో పాటు స్కాడా అనుసంధానం ద్వారా తక్షణ ఫీడర్ మానిటరింగ్, విద్యుత్ సరఫరా సంబంధిత సమాచారాన్ని రియల్ టైంలో తెలుసుకునే అవకాశం వినియోగదారులకు కలుగనుంది.

జిల్లాలో కొత్తగా ఐదు సబ్ స్టేషన్ లు..

జిల్లాలో నూతనంగా మంజూరైన సబ్ స్టేషన్లలో కొన్నింటిలో పనులు ప్రారంభం కాగా మరికొన్ని త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

మంచిర్యాలలోని లక్ష్మీనగర్ (జలగుట్ట) నూతన సబ్ స్టేషన్ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి.

హాజీపూర్ మండలంలోని దొనబండలో పనులు ఇటీవలనే ప్రారంభించారు.

బెల్లంపల్లి మండలంలోని బుధకలాన్‌లో ప్రత్యేక ఆహార ప్రాసెసింగ్ కి సంబంధించిన సబ్ స్టేషన్ పూర్తికావస్తోంది.

బెల్లంపల్లి మండలంలో అకెనపల్లిలో నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

భీమారం మండలంలోని నర్సింగపూర్ (బీ)లో సైతం త్వరలోనే నిర్మాణం ప్రారంభించనున్నారు.

నాణ్యమైన విద్యుత్ అందించడం కోసమే 

విద్యుత్ వినియోగదాలకు నాణ్యమైన విద్యుత్ అందించడం కోసమే అవసరమైన చోట కొత్త సబ్ స్టేషన్ లు మంజూరు చేసి పనులు ప్రారంభించాం. మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా నిర్మాణంలో ఉన్న ఈ సబ్ స్టేషన్లతో భవిష్యత్తులో రైతులు, వినియోగదారులు ఎదుర్కొంటున్న అంతరాయాలు తగ్గుతాయి.

ఫీడర్ల పొడవు తగ్గడం వల్ల నష్టాలు తగ్గి, సరఫరాలో స్థిరత్వం మెరుగవుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న సబ్ స్టేషన్లపై భారం తగ్గి, విద్యుత్ సరఫరా నిరంతరంగా, నాణ్యంగా ఉండే అవకాశం కలుగుతుంది.

 ఉత్తమ్ ఝాడే, సూపరింటెండింగ్ ఇంజనీర్, మంచిర్యాల