calender_icon.png 10 July, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందు విప్లవోద్యమ అరుణ తారలు రాయల చంద్రశేఖర్, ఎల్లన్న, గండి యాదన్న

10-07-2025 12:34:52 AM

16న అమరుల స్మారక స్థూపాల ఆవిష్కరణ సభను జయప్రదం చేయండి

- మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ప్రజాపంథా రాష్ట్ర నాయకులు చండ్ర అరుణ

-ఇల్లెందు, జూలై 9 (విజయక్రాంతి):విప్లవోద్యమంలో నిస్వార్ధంగా ప్రజల కోసం ప్రాణాలర్పించిన ఎల్లన్న, రాయల చంద్రశేఖర్, గండి యాదన్నల విప్లవ పోరాట స్ఫూర్తిని ఇల్లెందు ప్రాంత ప్రజలు కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ప్రజాపంథా రాష్ట్ర నాయకురాలు చండ్ర అరుణ పిలుపునిచ్చారు. ఇల్లందు పట్టణం చండ్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్ లో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఇల్లందు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 16న రాయల చంద్రశేఖర్ మొదటి వర్ధంతి సందర్భంగా ఇల్లందు పట్టణంలో స్మారక స్థూపాల ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇల్లందు ఏజెన్సీ ప్రాంత ప్రజల కోసం, వారి హక్కుల కోసం, కూడు, గూడు, నీడ, భూమి కావాలని విప్లవ మార్గంలో ప్రయాణించే క్రమంలో పోలీసు నిర్బంధాలు, జైలు జీవితం, రౌడీ మూకల దాడులు ఎదుర్కొంటూ కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లను భరించి ప్రజా అభివృద్ధి కోసం ఆనాడు సాయుధ మార్గాన్ని ఎంచుకొని పీడిత ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు.

నోరులేని ఆదివాసీలు, దళితులు ఇతర పేద వర్గాలు దోపిడికి గురవుతుంటే వారికి ప్రశ్నించడం నేర్పించారని తెలిపారు. భూమిలేని పేదలకు భూమి పంచారు. కూలి రేట్లు, తునికాకు రేట్లు, అధిక ధరల నియంత్రణ కోసం పోరాడారని, వడ్డీ, నాగుల వ్యాపారస్తుల నడ్డి విరిచారని, ఊళ్ళల్లో బడులను పెట్టించారని, దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించి పోరాడారన్నారు. ఆ క్రమంలోనే జీర్ణించుకోలేని ఆనాటి ప్రభుత్వం ఎల్లన్నను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని తెలిపారు.

ఎల్లన్న ఆశలను కొనసాగస్తామని రాయల చంద్రశేఖర్, గండి యాదన్నలతోపాటు అనేకమంది విప్లవోధ్యమంలో పనిచేసి అమరులయ్యారన్నారు. ఆ అమరుల ఆశయాల వెలుగులో నేటితరం ప్రయాణించి నేటి పాలకులు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల పట్ల పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరుల సాక్షిగా ఏజెన్సీ ప్రజలకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు దక్కాలని ఏకం కావలసిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు.

అందుకు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ ముందు అడుగు వేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు నాయిని రాజు, ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈ శంశంకర్ మాట్లాడారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు బుర్ర వెంకన్న, ఆర్ బోస్, వాంకుడోత్ అజయ్, పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా ఇల్లందు పట్టణ కార్యదర్శి పాయ వెంకన్న, టియుసిఐ ఏరియా కమిటీ కార్యదర్శి మల్లెల వెంకటేశ్వర్లు, గురునాథం, రఘు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.