11-05-2025 11:19:22 PM
బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్
మందమర్రి,(విజయక్రాంతి): బీసీ ఉద్యమాన్ని ప్రతి పల్లెలో బలోపేతం చేసి ప్రతి పల్లెలో బీసీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కుల గణన ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ మేల్కొలుపు రథ యాత్ర ఆదివారం పట్టణానికి చేరుకుంది. రథయాత్రకు పట్టణ బీసీ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు సంజయ్ కుమార్ మాట్లాడారు.
దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు సరైన అవకాశాలు లేక అన్ని రంగాల్లో వెనుకబడి, అణగారిన వర్గాలుగా పేదవారుగా మిగులుతు న్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి మూల నివాసులైన ప్రజలు మెజారిటీ ప్రజలు బీసీలనీ, స్వతంత్ర భారతదేశంలో మెజారిటీ ప్రజల లక్ష్యాలను పక్కనపెట్టి కార్పొరేటీకరణకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని ఆయన మండిపడ్డారు.విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలను కల్పించాలని, జనాభా ప్రాతిపదికన వాటాను అందించాలని తద్వారా బీసీల అభివృద్ధి సాడిస్మవుతుందని ఆయన స్పష్టం చేశారు. పౌర అభివృద్ధి ద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుంద ని, దేశ అభివృద్ధికి దోహద పడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు.
బీసీల ప్రాథమిక హక్కు అయిన కుల గణన సాధన కోసం 78 సంవత్సరాలుగా బీసీలు పోరాడుతున్న ప్రభుత్వాలు వంచించడం తప్ప చిత్తశుద్ధితో పనిచేయ లేదని, బీసీల అభివృద్ధి కోసం మండల కమిషన్ చేసిన సిఫారసులను తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక బీసీలకు స్వాతంత్రం పోయిందని, విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ సామాజిక రంగాలలో మేమెంతో మాకంత వాటాను సాధించినప్పుడే బీసీలు విముక్తి చెందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నా మన్నారు. బీసీ మేల్కొలుపు రథయాత్రను తెలంగాణ జాతిపిత, తెలంగాణ సామాజిక ఉద్యమాల పితామహుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో ఆయన స్వగ్రామం వాంకిడి లో ప్రారంభించడం జరిగిందని ఈ యాత్ర అలంపూర్ లో ముగుస్తుందని తెలిపారు.
ఈ యాత్రకు పట్టణ బిసి సంఘం నాయకులు సకినాల శంకర్, కొండిల్ల శ్రీనివాస్, నేరెళ్ళ వెంకటేష్, ముడారపు శేఖర్ లు స్వాగతం పలుకగా, బిసి సంఘం జిల్లా నాయకులు వడ్డేపల్లి మనోహర్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే, బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుడికాల భాస్కర్, జీనుకల లక్ష్మన్ రావు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి సుంకటీ పోశెట్టి, గుమ్ముల శ్రీనివాస్, విద్యార్థి నాయకులు వంశి నేత, నామని అర్జున్, పట్టణ కుల సంఘాల నాయకులు
పాల్గొన్నారు.