07-07-2025 05:12:10 PM
ఏవో కిరణ్మయి..
మందమర్రి (విజయక్రాంతి): రైతులు వరి నాట్లు వేసే సమయంలో తమ పొలాల్లో కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి(Mandal Agriculture Officer Kiranmayi) అన్నారు. మండలంలోని సారంగపల్లి గ్రామ శివారులోని పొలంలో సోమవారం నాట్లు వేస్తున్న మహిళ కూలీలకు కాలిబాటల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ... వరిలో నాట్లు వేసే సమయంలో తూర్పు పడమరలుగా ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల ఎడమతో కాలి బాటలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా పైరుకు గాలి వెలుతురు బాగా సోకి పంట ఎదుగుతుందని, అంతేకాకుండా పంటలో దోమపోటు ఉధృతిని తగ్గించు కోవచ్చని, ఎరువులు, పురుగు మందుల పిచికారికి సౌకర్యవంతంగా ఉండి పైరుని పరిశీలించేందుకు అనుకూలంగా ఉంటాయన్నారు.
నారు కొనలను తుంచి నాటు వేయడం ద్వారా కాండం తొలుచు పురుగు ఉదృతిని తగ్గించుకోవచ్చన్నారు. 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎడమతో ఒక దుబ్బుకు మూడు నాలుగు కర్రలతో నాటు వేయాలని తద్వారా ఎక్కువగా పిలకలు వచ్చి అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. ఎక్కువ నారు వినియోగించడం ద్వారా పంట ఎదుగుదల తగ్గి ఎక్కువ పిలకలు రాక దిగుబడులలో తగ్గుదల కనిపిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, సైండ్ల కనకరాజు, రైతు బిక్షపతి, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.