07-07-2025 07:27:09 PM
సనత్‌నగర్ (విజయక్రాంతి): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండగ, ఘటాల ఊరేగింపు, రంగం ఉత్సవాలకు.. మరోవైపు బాపునగర్ వీరాంజనేయ, వెంకటేశ్వర షిరిడి సాయిబాబా దేవస్థానంలో గురుపౌర్ణమి ఉత్సవాలకు హాజరు కావాలంటూ పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ(Constituency In-charge Dr. Kota Neelima)కి ఆహ్వానం అందింది. ఉజ్జయిని మహంకాళి దేవస్థాన ఈఓ మనోహర్ రెడ్డి, బాపునగర్ ఆలయ ఈఓ నరేందర్ రెడ్డి సోమవారం కోట నీలిమను వారి కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓలు ఆలయంలో నిర్వహించబోయే పండగ విశేషాలను కోట నీలిమకు వివరించారు. ఈ నెల 10న సాయిబాబా గుడిలో గురుపౌర్ణమి ఉత్సవం ఉండగా.. జులై 13, 14న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండగ, రంగం, ఘటాల ఊరేగింపు ఉంటుందన్నారు.
ఈ నేపథ్యంలో డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. తనను ఆహ్వానించిన ఈవోలకు, ఇతర ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ఉత్సవాలకు తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. బోనాల జాతరతో పాటే గురుపౌర్ణమి ఉత్సవానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మరోవైపు మహంకాళి దేవస్థానం నందు బోనాల సమర్పణ, రంగం, అమ్మవారి అంబారి ఊరేగింపులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. అందులో భాగంగా లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తారని అందుకు తగ్గట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని దేవస్థానం అంటే సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉందన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఈవోలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోట నీలిమ వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.