22-07-2025 12:31:04 AM
తిరువనంతపురం, జూలై 21: కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ (101) తుదిశ్వాస విడిచారు. ఈ నెల 23న గుండెపోటుకు గురైన ఆయన తిరువనంతపురం లోని ఎస్‌యూటీ ప్రైవేటు ఆసుపత్రిలో చికి త్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన కన్నుమూశారు.
2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పని చేశారు. అవిభక్త వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సీపీఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ ఒకరు. 1923 అక్టోబర్ 20న కేరళలో నిరుపేద కుటుంబం లో అచ్యుతానందన్ జన్మించారు.
కార్మిక ఉద్యమం నుంచి ప్రజా జీవితంలోకి
బాల్యంలో పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేసి.. దర్జీ దుకా ణంలో, కొబ్బరి పీచు ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ.. జీవనం సాగించిన అచ్యుతానందన్ కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టారు. 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. స్వాతంత్య్రానికి ముందున్న ట్రావెన్‌కోర్ సంస్థా నంలో భూస్వాములపై పోరాటంలో భా గంగా జైలు కెళ్లటంతో ఆరంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ప్రజా నేతగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది.
1964లో సీపీఐ జాతీయ కౌన్సిల్‌ను వదిలేసి.. సీపీఎం ఏర్పాటులో కీలకపాత్ర పోషిం చారు. 1985లో సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరించారు. 1967 నుంచి 2016 దాకా ఏడుసార్లు కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 15 సంవత్సరాల పాటు అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా వ్యహరించి అధిక కాలం విపక్ష నేతగా కొనసాగి రికార్డులకెక్కారు.
భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం
అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో అచ్యుతానందన్ ఎన్నడూ వెనుకంజ వేయలేదు. రాష్ట్రంలో భూఆక్రమణదారులపైనా ముఖ్యమంత్రిగా ఉక్కుపాదం మో పారు. ఈ చర్యలతో వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆయన ఏనాడు భయపడలేదు. నిరంతర అధ్యయనశీలి అయిన అచ్యుతానందన్..
తన హయాంలో సాంకేతిక ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ రూపంలో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం సాగుతోందని గుర్తించి అందరికి అం దుబాటులో ఉండే ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ కోసం ఉద్యమించడం విశేషం. వీఎస్ అచ్యుతానందన్ కె.వసుమతిని వివాహమాడారు. ఆయనకు కూతరు ఆశ, కుమారుడు అరుణ్ కుమార్ సంతానం. కాగా అచ్యుతానందన్ మృతి పట్ల సీఎం రేవంత్ సహా పలువరు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.