09-07-2025 07:59:56 PM
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): పనిచేయడం చేతకాని వారు ఏడుస్తారు.. నీకు మంత్రి పదవి ఇస్తే మాకెందుకు ఏడుపు.. ఏడుపులు పెడబొబ్బలు ఎందుకు సీతక్క అంటూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Former Minister Satyavathi Rathod) ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ములుగు జిల్లా ఏర్పాటుతో సహా సమగ్ర అభివృద్ధికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ములుగు జిల్లా ఏర్పాటుతోపాటు కలెక్టరేట్, మెడికల్ కళాశాల, గిరిజన యూనివర్సిటీ, ఎటునాగారం డివిజన్ కేంద్రం, సిహెచ్ సి, ఫైర్ స్టేషన్, ములుగు మున్సిపాలిటీ, బస్సు డిపో ఏర్పాటుకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కేవలం సోషల్ మీడియాలో హైలెట్ కోసం నెత్తిన మూటలు పెట్టుకుని వీడియోలు చేసి, ఇంకా ఎంతకాలం ప్రజలను మోసగిస్తారని ప్రశ్నించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఇద్దరు మహిళలకు మంత్రి పదవి ఇస్తే పదవీ నిర్వహణ చేతకాక, మీ పార్టీ పెద్దలే మీ శాఖల పనితీరుపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారని, ముందుగా మీరు పనితీరును సరిదిద్దుకోవాలని సత్యవతి రాథోడ్ అన్నారు. మంత్రుల సమక్షంలో ఫోటోలు దిగి గత ప్రభుత్వం మీద అక్కకు వెళ్ళకక్కడం కాదని, గత ప్రభుత్వ హాయంలో మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి మంజూరు చేసిన నిధులు, పనుల అమలు తీరుపై సమీక్ష జరపాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యే లు డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, డాక్టర్ భూక్య మురళి నాయక్ లకు సత్యవతి రాథోడ్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆంగోత్ బిందు, మహబూబాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.