09-07-2025 10:58:34 PM
హుజురాబాద్ ఏసిపి మాధవి..
హుజురాబాద్ (విజయక్రాంతి): జల్సాలకు అలవాటు పడిన నలుగురు యువకులు ఆంధ్రప్రదేశ్ నుండి గంజాయి దిగుమతి చేసుకొని అమ్ముతుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించినట్లు హుజురాబాద్ ఏసిపి మాధవి(ACP Madhavi) తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్లో బుధవారం సీఐ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. మంగళవారం రాత్రి సమయంలో పట్టణ శివారులోని నిషేధిత గంజాయి విక్రయించేందుకు నలుగురు వ్యక్తులు వస్తున్నారని ముందస్తు పక్క సమాచారంతో పెట్రోలింగ్ చేస్తుండగా రెండు బైకులపై వచ్చిన నలుగురు యువకులను పట్టుకొని విచారించి వివరాలు సేకరించినట్లు తెలిపారు.
వారి వద్ద నుండి సుమారు రూపాయలు3.75 లక్షల విలువ గల 15 కిలోల గంజాయి రెండు బైకులు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు రిమాండ్ కు తరలించిన వారిలో మొహమ్మద్ ఆఫ్రిద్ (21) పాశం తరుణ్ (25) బండి పూర్ణచందర్ (23) శశి ప్రీతం (24) ఉన్నట్లు తెలిపారు. యువకులు గంజాయి బారిన పడవద్దు అని ఎవరైనా గంజాయి విక్రయించిన, సేవించిన పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గంజాయి సేవించిన వారిని పట్టుకునేందుకుగాను తమ వద్ద ప్రత్యేక పరికరాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. గంజాయికి బానిసై యువకులు భవిష్యత్తును నిర్వీర్యం చేసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్, హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ యాకూబ్, కానిస్టేబుల్ అబ్దుల్ ఖాదీర్, రాజేందర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.