02-08-2025 04:35:31 PM
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విసుర్లు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మెనూ ప్రకారం అల్పాహారం అందించకుండా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా కారం మెతుకులు పెట్టడం ఏమిటని, పిల్లలు ముద్దగా మారిన అన్నం తినలేక ఖాళీ కడుపులోనే తరగతి గదులకు వెళ్లాల్సిన దుస్థితి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల(Tribal Welfare Girls Gurukul School)లో ఏర్పడిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Former Minister Satyavathi Rathod) విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని గురుకుల హాస్టల్ ను ఆమె సందర్శించి విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన తీరు, హాస్టల్ నిర్వహణ, మెనూ ప్రకారం అల్పాహారం భోజనం అందిస్తున్నారా అనే విషయంపై ఆరా తీశారు.
వంట గదిలోకి వెళ్లి పిల్లలకు అందిస్తున్న అల్పాహారం ఏమిటని ప్రశ్నించి వండిన గిన్నెను చూసి అక్కడ ఒక గిన్నెలో కారం పొడి, మరో పెద్ద గిన్నెలో వండిన అన్నం ముద్దగా మారడం, కొంత మాడిపోవడం చూసి ఇదేనా పేద విద్యార్థులకు అమలు చేస్తున్న మెరుగైన సంక్షేమం అంటూ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాలను పూర్తిగా గాలికి వదిలేసారని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతానని డబ్బా కొట్టుకోవడం తప్ప ఒక్క స్కూలు కట్టింది లేదన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 284 గురుకులాలను1,023 కు పెంచి ఆరు లక్షల మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. హనుమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట అన్న సామెతగా కెసిఆర్ ఆనవాళ్లు మారుస్తా అంటే ఏమిటో అనుకున్నాం.. గురుకులాల నుండి విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడం అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గురుకులాల్లో మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం సక్రమంగా అమలు చేసేలా చూడాలన్నారు.