calender_icon.png 2 August, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లకు కేంద్ర బిజెపి ప్రభుత్వం అడ్డుపడుతుంది: మంత్రి శ్రీధర్ బాబు

02-08-2025 07:15:03 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ అమలు చేయుట కొరకు తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుంటే కేంద్ర బిజెపి ప్రభుత్వం అడ్డు పడుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) విలేకరుల సమావేశంలో అన్నారు. శనివారం మలహర్రావు మండలంలోని తాడిచెర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలకు వచ్చిన సందర్భంగా మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బీసీ నిరుపేదల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం కేబినెట్లో నిర్ణయించి ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు అన్నారు.

కేంద్రంలో ఉన్న బిజెపి ఎంపీలకు రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎమ్మెల్యేలకు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ బిల్లు ఆర్డినెన్స్ ఆమోదంలో  జాప్యానికి నిరసనగా  5.6.7 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన  ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత పది సంవత్సరాలుగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు చేయకుండా ముసలి కన్నీరు కారుస్తూ కాలయాపన చేసిందన్నారు.  బిజెపి, బిఆర్ఎస్, పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే తాము చేసే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొనాలని బిసి రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం పొందే విధంగా ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, ఈజీఎస్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఇప్ప మండయ్య, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.