calender_icon.png 22 November, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రం అప్పులపాలు కాకుంటే హామీలు అమలయ్యేవి

22-11-2025 09:59:32 PM

మంత్రి జూపల్లి కృష్ణారావు..

కొల్లాపూర్ రూరల్: తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత గత పాలకులదేనని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం పెంట్లవెల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంతానికి త్రాగునీరు–సాగునీరు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రత్యేక రాష్ట్రం కోసం తానే ఎమ్మెల్యే, మంత్రి పదవులు విడిచిపెట్టి పోరాటం చేశానని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు చేరిందన్నారు.

ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారంటీల ద్వారా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ₹500 గ్యాస్, పేదలకు సన్నబియ్యం, ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి సంక్షేమాలు అందజేస్తోందని తెలిపారు. ప్రైవేట్ విద్య, వైద్య ఖర్చులు కుటుంబాలను అప్పుల్లోకి నెడుతున్నాయని, ప్రజలు ప్రతిరోజూ ఒక గంట యోగా చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. అనంతరం మల్లేశ్వరం కృష్ణానది హైలాండ్ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ₹48 కోట్లతో శంకుస్థాపన చేశారు. సోమశిల, మల్లేశ్వరం ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో రామన్ గౌడ్, సువర్ణ, గోవింద్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహ, డిఆర్డిఏ ఓబులేష్, మహిళా సమైక్య ఏపీఎం తిరుపతయ్య, వసంత తదితరులు పాల్గొన్నారు.