16-11-2025 12:19:02 AM
-ఫేస్బుక్ ఖాతా తెరిచి, రూ.20 వేలు టోకరా
-సజ్జనార్ స్నేహితులకు మెసేజ్‌లు
-ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సజ్జనార్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసానికి తెరలేపారు. ఆయన పేరుతో ఒక ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాను సృష్టిం చి, ఆయన స్నేహితుడి నుంచే రూ.20 వేలు కాజేశారు. ఈ ఘటనపై స్వయంగా సజ్జనార్ స్పందించి, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు సజ్జనార్ ఫొటో, పేరుతో ఒక ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేశారు.
ఆ తర్వాత, ఆయన ఫేస్‌బుక్ స్నేహితుల జాబితాలో ఉన్నవారికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపారు. వాటిని యాక్సెప్ట్ చేసిన వారికి ‘నేను ఆపదలో ఉన్నాను, అత్యవసరంగా డబ్బులు కావాలి, వెంటనే పంపించండి’ అంటూ మెసెంజర్ ద్వారా సందేశాలు పంపారు. ఇది నిజమేనని నమ్మిన సజ్జనార్ స్నేహితుల్లో ఒకరు ఏమాత్రం ఆలోచించకుండా మోసగాళ్లు చెప్పిన ఖాతాకు రూ.20 వేలు బదిలీ చేశారు.
ఆ తర్వాత అనుమానం వచ్చి సజ్జనార్‌కు ఫోన్ చేయడంతో అసలు విష యం బయటపడింది. ఈ మోసంపై స్పందించిన వీసీ సజ్జనార్.. ‘నా పేరుతో ఫేక్ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించి, నా స్నేహితులకు సైబర్ నేరగాళ్లు మోసపూరిత సందే శాలు పంపిస్తున్నారు. నేను పేర్కొన్న అధికారిక ఫేస్బుక్ పేజీ మినహా, నా పేరుతో ఉన్న మిగతా ఖాతాలన్నీ నకిలీవే’ అని స్పష్టం చేశారు. ‘నా పేరుతో గానీ, ఏ ఇతర అధికారి, ప్రముఖ వ్యక్తి పేరుతో గానీ ఫేస్బుక్‌లో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులపై స్పందించవద్దు’ అని సూచించారు.