08-11-2025 04:22:41 PM
దౌల్తాబాద్: మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న కల్లాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల ఉపాధ్యక్షుడు మద్దెల స్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు మాట్లాడుతూ.... మండలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలో పీఏసీఎస్ చైర్మన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
చైర్మన్ కేవలం ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే ప్రయత్నిస్తున్నారని, రైతుల మేలు కోసం ఏ చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, అయితే చైర్మన్ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు కేంద్రం ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనార్థం వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. వారితో పాటు ఆత్మ కమిటీ డైరెక్టర్ సూరంపల్లి ప్రవీణ్, నాయకులు రైతన్న, లలిత కృష్ణ, పంజా రమేష్, కృష్ణ తదితరులున్నారు.