18-07-2025 12:09:08 AM
పట్నా, జూలై 17: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డ నితీశ్ ప్రభుత్వం తాజాగా 125 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని నితీశ్ కుమార్ ప్రకటించారు.
ఈ పథకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ పథకంతో రాష్ట్రంలో 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇక రానున్న మూడేళ్లలో గృహ వినియోగదారులందరి మద్దతుతో ప్రతి ఇంటిపై సోలార్ పవర్ ప్లాంట్లను అమర్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. కుటీర్ జ్యోతి పథకం కింద.. అత్యంత పేద కుటుంబాలకు సోలార్ ప్లాంట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో 10వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి నితీశ్ తెలిపారు. కాగా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా ప్రతి విభాగంలోని అన్ని పోస్టులకు మహిళలకు 35 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని సీఎం తెలిపారు. అలాగే ఫించన్లపై కీలక హామీలు వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. బీహార్‌లో ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది.