14-08-2025 01:59:45 AM
భీమదేవరపల్లి, ఆగస్టు 13 (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు ముత్తారం గ్రామానికి చెందిన మోకిడి రాజేశ్వరరావు సతీమణి మోకిడి మల్లమ్మ బుధవారం వారి స్వగృహంలో స్వర్గస్తులయ్యారు. ఆమె వయస్సు సుమారు 95 సం.లు. దేశ స్వాతంత్య్ర సమరంలో, ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ప్రజలకు చైతన్యం కల్పించడంలో రాజేశ్వరరావు, మల్లమ్మ కీలక పాత్ర పోషించారు.
పోరాట దశలో ఇద్దరూ కలిసి పల్లె పల్లె తిరిగి రైతులకు, కూలీలకు చైతన్యం కల్పించారు. ఆ కాలంలో ఎదురైన అణచివేతలతో పాటు, బ్రిటిష్ పాలనలోని అన్యాయాలపై గళమెత్తారు. మల్లమ్మ మరణవార్త తెలుసుకున్న ప్రాంతీయ ప్రజలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని గౌరవించే కార్యకర్తలు పెద్ద ఎత్తున విచారం వ్యక్తం చేస్తున్నారు. గురువారం అంత్యక్రియలు వారి స్వగృహం ముత్తారంలో నిర్వహించనున్నారు.