14-08-2025 02:00:54 AM
కొత్త స్లాబ్‌లు తీసుకొచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాష్ర్టంలో వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మోటార్ వాహనాల పన్ను చట్టంలోని మూడవ, ఆరవ, ఏడవ షెడ్యూళ్లను సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. రోడ్డు మౌలిక సదుపాయాలు, రోడ్ సేఫ్టీ మెరుగుదలకు ఈ ట్యాక్స్ పెంపు అమలులోకి తెస్తున్నట్టు ప్రకటించింది.
మోటార్ బైక్స్, స్కూటర్లు, ట్రై సైకిళ్లు, కార్లపై వాహన ధర ఆధారంగా ట్యాక్స్ శాతం పెంచారు. కొత్తగా రిజిస్టర్ అయ్యే ద్విచక్ర వాహనాలపై ధర ఆధారంగా 9 శాతం నుంచి 18 శాతం మధ్య.. నాన్-ట్రాన్స్‌పోర్ట్ కార్లపై 13 శాతం నుంచి 21 శాతం వరకు లైఫ్ ట్యాక్స్, కంపెనీలకు, సంస్థలకు చెందిన వాహనాలతో పాటు రెండో లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిగత కార్లపై 15 శాతం నుంచి 25 శాతం వరకు లైఫ్ ట్యాక్స్ ఉండనుంది.
వాహన వయస్సును అనుసరించి ఇప్పటికే రిజిస్టర్ చేసిన వాహనాలపై ఆయా క్యాటగిరీల ప్రకారం 1 నుంచి 24 శాతం మేర లైఫ్ ట్యాక్స్ ఉండనుంది. ఈ మార్పు గురువారం నుంచి అమల్లోకి వస్తుంది. ఖరీదైన వాహనాలపై 25 శాతం మేర ట్యాక్స్ విధించడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
రూ.50 లక్షలకు పైగా విలువైన వాహనాలు ధనవంతులే కొనే నేపథ్యంలో ఆ వర్గంపై ట్యాక్స్ భారీగా పెంచినా సామాన్యులకు కలిగే ఇబ్బందులేమీ ఉండబోవు. సుమారు రూ.1 కోటి విలువ చేసే కారు కొంటే పెంచిన లైఫ్ ట్యాక్స్ ప్రకారం రూ.25 లక్షలు లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.