calender_icon.png 12 October, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాలిబన్లతో స్నేహహస్తం

11-10-2025 12:00:00 AM

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్నది నానుడి. తాజాగా తాలిబన్‌ల ఆధ్వర్యంలోని అఫ్గానిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ఐదు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్‌లో అడుగుపెట్టారు. శుక్రవారం ముత్తాకీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. అఫ్గాన్‌లో అభివృద్ధి జరుగుతుందని, ఆరు కొత్త ప్రాజెక్టులు చేపడతామని, కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయం తిరిగి మళ్లీ తెరుస్తామని, తాలిబన్ ప్రభుత్వం ఢిల్లీలో రాయబార కార్యాలయం ప్రారంభించుకోవడానికి అనుమతులిస్తున్నట్లు జై శంకర్ పేర్కొన్నారు.

నిజానికి భారత్ ఎప్పుడూ అఫ్గానిస్థాన్‌ను తమ శత్రువుగా భావించలేదు. అఫ్గాన్ ప్రజలను ఆదుకునేందుకు భారత్ ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంది. 2021లో తాలిబన్ల పునరాగమనంతో అష్రాఫ్ ఘనీ ప్రభుత్వం పడిపోయేవరకూ మన దేశం అఫ్గానిస్థాన్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టింది. రూ. 25 వేల కోట్ల వ్యయంతో పార్లమెంట్ భవనాన్ని, సల్మా ఆనకట్ట, ఒక జాతీయ రహదారిని నిర్మించింది. విద్యుదుత్పాదన ప్రాజెక్టులు, విద్య, వైద్యం తదితరాల్లోనూ పా లుపంచుకుంది.

ఇటీవల భూకంపం సంభవించినప్పుడు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, మందులు, వ్యాక్సిన్లు పంపించింది.  తాలిబన్ల పాలన లో ఉన్న అఫ్గాన్‌లో ఉగ్రవాదం పెరిగే అవకాశం ఉందనే కారణంతో భా రత్ క్రమంగా దూరమవుతూ వచ్చింది. అయితే ఒకప్పుడు పాకిస్థాన్ తాలిబన్లకు మిత్రదేశంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వారి సంబంధాలు దె బ్బతిన్నాయి. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) కీలక నేతకు అఫ్గానిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ఆరోపణలు చేసింది.

టీటీపీ చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ స్థావరమే లక్ష్యంగా ఫైటర్ జెట్‌తో దాడులు చే యడం ఉద్రిక్తతకు దారి తీసింది. పాక్‌తో విభేదాలు అఫ్గాన్‌ను భారత్ వైపు మొగ్గేలా చేశాయి. మరోవైపు ఉజ్బెకిస్థాన్ ద్వారా అఫ్గాన్‌కు సన్నిహితం కా వటానికి పాక్ చేస్తున్న ప్రయత్నాలు, చైనా వరుస మంతనాలు భారత్‌ను ఆలోచనల్లో పడేశాయి. అఫ్గాన్‌తో బంధం బలోపేతం కాకపోతే ఏదో ఒకరోజు తాలిబన్, పాకిస్థాన్ సంబంధాలు మెరుగుపడే అవకాశముంది.

ఇవి మనకు పొరుగు దేశాలు కావడంతో భద్రత పరంగానూ ముప్పు ఎక్కువగానే ఉంటుంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అ ఫ్గాన్‌లోని బగ్రాం వైమానిక స్థావరాన్ని తమకు అప్పగించాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఈ పరిణామాలన్నింటిని గమనించిన భారత్ తా లిబన్‌లతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి సిద్ధపడింది. మరోవైపు ఇప్పటిదాకా తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు అధికారికంగా ఇంకా గుర్తించలేదు.

రష్యా మాత్రమే తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. తాజాగా భారత్ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు ముందడుగు వేసింది. మరోవైపు భారత్ లాంటి దేశంతో సంబంధాలు పెంచుకుంటే.. తమ పాలనకు అంతర్జాతీయ వేదికపై చట్టబద్ధత లభిస్తుందని తాలిబన్ భావిస్తోంది.

అఫ్గానిస్థాన్‌లో చైనా ప్రభావం పెరుగుతున్న క్రమంలో భారత్ కూడా అఫ్గాన్‌లో తమ ఉనికిని స్థాపించాలని, దీంతో పాటు పాకిస్థాన్‌కు అఫ్గాన్ ప్రాంతంపై పూర్తిగా పట్టు ఉండకుండా చూడాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే అనుకూల వాతావరణంలో బంధం బలపడేలా భారత్, అఫ్గానిస్థాన్‌ల మధ్య చర్చలు జరగడం శుభపరిణామం.